ఓ నిరాశ‌లో కొంత ఆశ‌. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కచులూరు వద్ద గోదావరిలో బోటుజాడ విష‌యంలో ఆందోళ‌న‌లు....ఆశ‌-నిరాశ‌లు కొన‌సాగుతున్నాయి. గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ లాంచీని బయటకు తీసేందుకు అధికారులు ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టడంలేదు. దేశవ్యాప్తంగా ఉన్న సముద్ర నిపుణులను రప్పిస్తున్నారు. బోటుజాడ‌ను అతికష్టంమీద గుర్తించిన రెస్క్యూటీంకు దాన్ని వెలికితీయడం మరింత క్లిష్టంగా మారింది. ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేకనిపుణుల బృందాన్ని రంగంలోకి దింపినా.. బోటును బయటకుతీయడం దాదాపు అసాధ్యమని వారు తేల్చేసినట్టు సమాచారం.


గతంలో ఘోరప్రమాదాలు, ఇంతకు మించిన లోతుల్లో చిక్కుకున్న బోట్లను వెలికితీసినప్పటికీ కచులూరు వద్ద పరిస్థితులు భిన్నంగా ఉండటంతో నిపుణులు ఆ సాహసం చేయలేకపోతున్నారు. అయితే లోతులో, బురదలో కూరుకుపోవడంతో బోటును బయటకు తీసేకంటే, అక్కడికి ప్రవేశించి బోటులో ఇంకెవరి మృతదేహాలయినా ఉన్నాయా? అనేకోణంలో గాలింపు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అందరి మృతదేహాలు దొరికితే సెర్చ్ ఆపరేషన్‌ను ముగించే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.


బోటు మునిగిన ప్రాంతంలో పెద్దపెద్ద సుడిగుండాలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం ముంబైకి చెందిన సముద్రనిపుణుడు సౌరవ్‌భక్షి ప్రమాదస్థలానికి చేరుకున్నారు. 210 అడుగుల లోతులో ఉన్న లాంచీని బయటకు తీయడంలో అవసరమైన సూచనలు, సహాయం చేసేందుకు కాకినాడపోర్ట్ అధికారులు భక్షిని ఇక్కడకు రప్పించారు. ఆయ‌న‌తో ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. కాగా, గురువారం ఒక మృతదేహం లభ్యమయింది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 35కు చేరింది. బుధవారం లభించిన కడిపికొండకు చెందిన బస్కె రాజేంద్రప్రసాద్, న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ మృతదేహాలు గురువారం తెల్లవారుజామున సమయంలో స్వస్థలానికి చేరుకున్నాయి. వీరికి గురువారం అంతిమసంస్కారాలు నిర్వహించారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ఘటన జరిగి ఐదురోజులు కావడం.. మృతదేహాలు ఉబ్బి వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో నీటిప్రవాహ ప్రాంతాలపైనా నిఘా పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: