గ‌త కొంత‌కాలంగా అనూహ్య‌మైన కామెంట్ల‌తో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి వార్త‌ల‌లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీని ఎండ‌గ‌ట్ట‌డం ద్వారా మీడియాలో నిలిచిన జ‌గ్గారెడ్డి తాజాగా...ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం ద్వారా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఈ ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్న జ‌గ్గారెడ్డి...ఈ స‌మ‌యంలో కేసీఆర్ మేన‌ల్లుడు, ప్ర‌స్తుత మంత్రి హ‌రీశ్‌రావుపై మాత్రం విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా ఆయ‌న స్టాండ్ మార్చేశారు. హరీష్‌రావుతో ఘర్షణ ఉండదని జగ్గారెడ్డి ప్ర‌క‌టించారు.


ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్‌రావుపై మాత్రం విరుచుకుప‌డుతున్న జగ్గారెడ్డి మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సాక్షాత్తు హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ క‌ల‌కం రేపే వ్యాఖ్య‌లు చేశారు. సింగూరు నీళ్ల త‌ర‌లింపు గురించి స్పందించిన జ‌గ్గారెడ్డి ఆనాటి మంత్రి హరీశ్‌రావు నీటిని తరలించినప్పుడు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎటుపోయారని ప్ర‌శ్నించారు. ``హరీశ్ రావు ఒక్క‌డే నీటిని తరలించారని నేను అనుకున్న..కానీ కేటీఆర్,కవిత, వినోద్, ఈటెల ఉన్నారని టీఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. ఇది నిజమా కాదా.. ఆ నలుగురు సమాధానం చెప్పాలి`` అని డిమాండ్ చేశారు. అనంత‌రం  ఓ సంద‌ర్భంలో ఏకంగా సీఎం కేసీఆర్‌కు స‌న్మానం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, దాని ద్వారా నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో జ‌గ్గారెడ్డి ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.


గ‌తం ఇలా ఉంటే.... ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో ఇకపై ఘర్షణ ఉండదు అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌కు ప్రజలు రెండోసారి కూడా పట్టం కట్టారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తాను. ఇకపై హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరి ప్రచారం వారిదే. సంగారెడ్డిలో హరీష్‌రావుతో ప్రచారం చేసుకున్నా అభ్యంతరం లేదు`` అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: