హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుపడుతూ , ఆయన్ని ఇరుకున పెట్టేందుకు,  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడ బూమరాంగ్ అయిందా?  అంటే అవుననే గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.  త్వరలో జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం ఉత్తమ్ పద్మావతి ఏకపక్షంగా ఉత్తమ్ అభ్యర్థి గా  ప్రకటించారని, పద్మావతి కాకుండా మరొకర్ని అభ్యర్థిగా ఎంపిక చేయాలని కోరుతూ  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాకు  ,  రేవంత్ ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.


 అంతటితో ఆగకుండా హుజూర్ నగర్  నియోజకవర్గం అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి ని  ప్రకటించాలని ప్రతిపాదించడం పట్ల,  సొంత పార్టీ నేతలే ఆయన వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు . యురేనియం తవ్వకాల అంశం గురించి ఏ ఐ సి సి కార్యదర్శి సంపత్ కు ఏమి తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద  దుమారాన్ని రేపుతున్నాయి . రేవంత్ వ్యాఖ్యలపై సంపత్ మండిపడుతున్నారు . తాను గతంలోనే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కి వెళ్లి ఫిర్యాదు చేశానని , ఏమి తెలియకుండానే ఫిర్యాదు చేశానా ? అంటూ పరోక్షంగా రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు .


  హుజూర్ నగర్ ఉప ఎన్నిక సంబంధించి,  పార్టీ అభ్యర్థి ఎంపిక తో తనకు  సంబంధం లేకపోయినా, అనవసర  వ్యవహారంలో జోక్యం చేసుకొని  రేవంత్ అభాసు పాలయ్యారని కాంగ్రెస్ పార్టీ  వర్గాలు అంటున్నాయి .  అసలే రేవంత్ పై గుర్రుగా ఉన్న సీనియర్లు ఇదే అదునుగా ఆయన్ని   లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఒకరేమిటి… ఇలా పలువురు రేవంత్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు దాడి తీవ్రతరం  చేస్తున్నారు.  దీంతో రేవంత్ వర్గం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: