ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగాల పరీక్షాపత్రాలు లీకయ్యాయని.. అది కూడా ఏపీపీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులే ఆ పని చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం రాసింది. ఆ పరీక్ష పేపర్లు సిద్ధంచేసిన ఏపీపీఎస్సీలోనే వారు పనిచేస్తున్నారని.. పేపర్లు తయారుచేసిన విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు ఈ పరీక్షలకు హాజరయ్యారని రాసింది. గురువారం విడుదలచేసిన సచివాలయ ఫలితాల్లో కేటగిరి-1లో టాప్‌ 1 ర్యాంకరు ఆమేనంటూ ఉదాహరణలు ఇచ్చింది.


అంతేకాదు. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారని రాసింది.ఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారని తెలిపింది. అయితే.. సచివాలయ పరీక్షలు పారదర్శంగా జరిగాయని, కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు రాశారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పేపర్‌ లీకైతే లీకైనప్పుడే ఎందుకు వార్త రాయలేదని ఆయన ప్రశ్నించారు.


ఫలితాలు వచ్చిన తరువాత లీకైనట్లు వార్తలు రాస్తారా అని నిలదీశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఇలాంటి కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవద్దని హితవు పలికారు. పేపర్‌ లీకైందంట. పేపర్‌ లీకైతే పరీక్షల రోజు వార్త రావాలి కానీ, ఫలితాల రోజు రావడం ఏంటీ.. ఎల్లో మీడియా, చంద్రబాబు కలిసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కష్టపడి చదివిన వారందరికీ మంచి మార్కులు వస్తే.. అన్యాయం జరిగింది. అవినీతి జరిగిందని విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారు. పిచ్చిరాతలు నమ్మి మోసపోవద్దు. అంటూ వివరణ ఇచ్చారు అంబటి రాంబాబు.


అంబటి వివరణ బాగానే ఉంది. కానీ.. ఆంధ్రజ్యోతి చెప్పిన ఉదాహరణల సంగతి అంబటి ఎందుకు ప్రస్తావించలేదు.. వారి విషయంలో ఆంధ్రజ్యోతి చెప్పింది తప్పు అని ఎందుకు ఖండించలేదు. అంటే ఆ ఉదాహరణలు కరెక్టేనా.. కాకపోతే.. ప్రభుత్వం ఎందుకు వారి వివరాలు బయటపెట్టలేదన్నది అభ్యర్థలను వేధిస్తున్న ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: