ఉప్పు నిప్పులాగుండే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య ఓ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరినట్లే కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు సభ్యుల నియామకాన్ని చూస్తే అదే అనుమానం వస్తుంది. తాజాగా ప్రభుత్వం నియమించిన 7 మంది  ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

 

చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డి చాలా పెద్ద వ్యాపారస్తుడి క్రిందే లెక్క. తమిళనాడులోని ఏఐఏడిఎంకె అధినేతలకు చాలా సన్నిహితుడు. అందుకే చంద్రబాబు హయాంలో నియమితులైన టిటిడి  ట్రస్టుబోర్డులో  శేఖర్ రెడ్డి సభ్యునిగా పనిచేశారు. అయితే అప్పట్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి నివాసంలో వందల కోట్ల విలువైన నగలు, హార్డ్ క్యాష్ పట్టుబడిన విషయం తెలిసిందే.

 

దేశమంతా నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడుతుంటే శేఖర్ రెడ్డి ఇంట్లో మాత్రం సుమారు వందల కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలు, కోట్లాది రూపాయల 2 వేల నోట్లు దొరకటం అప్పట్లో దేశంలోనే సంచలనమైంది. ఎప్పుడైతే శేఖర్ రెడ్డి ఇంట్లో బంగారం, నోట్లు పట్టుబడ్డాయో జనసేన అధినేత పవన్ ఆరోపణలు మొదలుపెట్టారు. శేఖర్ రెడ్డి-లోకేష్ మధ్య సంబంధాన్ని పవన్ ప్రముఖంగా ప్రస్తావించటంతో రచ్చ మొదలైంది.

 

దాంతో  చంద్రబాబు వెంటనే శేఖర్ రెడ్డిని టిటిడి ట్రస్టు బోర్డు సభ్యునిగా తొలగించారు. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ, సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్ధలన్నీ కేసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టాయి. నిజానికి ఆ వ్యవహారం నుండి బయటపడటానికి అప్పట్లో చంద్రబాబు నానా అవస్తలు పడ్డారు.  అలాంటిది ఇపుడు జగన్ ప్రభుత్వంలో కూడా అదే శేఖర్ రెడ్డి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమితుడయ్యాడంటే మామూలు విషయం కాదు.


అదేమంటే విచారణలో తనక క్లీన్ చిట్ వచ్చిందంటున్నారు శేఖర్. క్లీన్ చిట్ వచ్చింది సరే మరి ఇదే రెడ్డిగారిని బోర్డులో ఎందుకు నియమించాల్సొచ్చింది ? ఈ రెడ్డి గారిని కాదని మరో రెడ్డిని నియమించొచ్చు కదా ? అయినా ఈ శేఖర్ రెడ్డినే జగన్ కూడా   నియమించారంటే అర్ధమేంటి ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: