ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన చిన్నరపిడుగు రేవంత్ రెడ్డి.. 2014 లో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు, తెలంగాణలో తెరాస పార్టీ అధికారంలోకి రావడం, అనంతరం నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి బుక్కవ్వడంతో.. తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు.  కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.  ఎలాగైనా రేవంత్ ను ఓడించాలనే లక్ష్యంతో తెరాస క్యాడర్ మొత్తం పనిచేసింది  


ఫలితంగా తెరాస పార్టీ అక్కడ విజయం సాధించింది.  రేవంత్ మాజీ కావడం.. అదే ఎన్నికల్లో తెరాస పార్టీ తిరుగులేని శక్తిగా మారి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో రేవంత్ డీలాపడ్డాడు.  కాంగ్రెస్ పార్టీ సైతం ఆ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు గెలుచుకోలేకపోయింది.  పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తెరాస లో జాయిన్ అయ్యారు.  ఆ తరువాత రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.  రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో పాటు మల్కాజ్ గిరి నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది.  


రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని వినియోగించుకొని విజయం సాధించాడు.  రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన తరువాత రాష్ట్ర రాజకీయాలపైన పెద్దగా విమర్శలు చేయలేదు.  తెరాస పార్టీపై ఉవ్వెత్తున ఎగిసిపడే రేవంత్ సైలెంట్ గా ఉన్నాడు.  మరోవైపు రేవంత్ బీజేపీకి దగ్గరవుతున్నారని వార్తలు వచ్చాయి.  రేవంత్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  హుజూర్ నగర్ ఉపఎన్నికల విషయంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని వ్యతిరేకించడంతో.. మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు.  పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నిస్తున్నారు.  


అంతేకాదు, ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు చెల్లుబాటు అవుతాయిగాని, జాతీయ పార్టీలో అవి సాధ్యం కాదని సీనియర్ నేతలు మండిపడుతున్నారు.  పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తుల మాటలు వినాల్సిన అవసరం లేదని, వారి సలహాలు తీసుకునే విధంగా కాంగ్రెస్ లేదని సీనియర్ నేతలు చెప్పడం విశేషం.  కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే.  అంతర్గత కుమ్ములాటలు బలంగా ఉంటాయి. పోటీ ఎక్కువగా ఉంటుంది.  రేవంత్ కు ఈ విషయం తెలిసే అలా మాట్లాడుతున్నాడా.. సీనియర్లు తనపై మండిపడితే.. దానిని బేస్ చేసుకొని రేవంత్ పార్టీ మారాలని అనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.  రేవంత్ వ్యూహం అదే అయితే నెక్స్ట్ ఏ పార్టీలోకి అయన వెళ్లే అవకాశం ఉంటుంది.  బీజేపీలో జాయిన్ అవుతారా లేదంటే.. తెరాసకు దగ్గరవుతారా? చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: