స్ధాయి తక్కువ మాటలు మాట్లాడుతూ అందరి దగ్గరా చంద్రబాబునాయుడు క్లాసులు పీకించుకుంటున్నారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ పోస్టింగుల కోసం కక్కుర్తిపడుతూ పోలీసులు అధికార పార్టీ ఏమి చెబితే అలా చేస్తున్నట్లు ఆరోపించారు. నిజానికి చంద్రబాబు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవనే చెప్పాలి. దానిపై మంత్రులు కానీ అధికార పార్టీ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు.

 

అయితే పోలీసు అధికారుల సంఘం మాత్రం ఘాటుగానే స్పందించింది. శాంతి, భద్రతల కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై ఆరోపణలు, విమర్శలు చేయటం చంద్రబాబు స్ధాయికి తగవని చురకలంటించారు రాష్ట్ర అధ్యక్షుడు జే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎండి మస్తాన్ ఖాన్, కోశాధికారి సోమశేఖర్ రెడ్డి. పోస్టింగుల కోసం కక్కుర్తిపడే అధికారులు ఎవరూ పోలీసుల్లో లేరని స్పష్టంగా చెప్పారు చంద్రబాబుకు.

 

సరే సంఘం నేతలు ఎలాగున్నా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలైతే ఆయన స్ధాయికి తగనివనే చెప్పాలి. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోలీసుల పని వంటల్లో కరివేపాకనే చెప్పాలి. అవసరమున్నంత వరకూ ఉపయోగించుకుని తర్వాత తీసిపారేస్తారు. చంద్రబాబు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.

 

తన హయాంలో పోలీసులను ఏ స్ధాయిలో టిడిపి కోసం ఉపయోగించుకున్నది అందరూ చూసిందే. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరగ్గానే డిజిపి ఠాకూర్ స్పందించిన విధానం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఠాకూర్ వ్యవహరించిన విధానం పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగానే ఉందనటంలో సందేహం లేదు.

 

అలాగే అప్పటి ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు మద్దతుదారుగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. వైసిపి ఎంఎల్ఏలను ఫిరాయింపులకు గురి చేయటంలో ఆయనదే కీలకమనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తునే ఉన్నాయి. ఎంతమంది వైసిపి ఎంఎల్ఏలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టారో లెక్కేలేదు. ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులను ఇలాగే వాడుకుంటారనటంలో ఎవరికీ అనుమానం లేదు. తన హయాంలో పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చేసినట్లు చంద్రబాబు బిల్డప్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: