మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలతోపాటు దేశంలో ఖాళీ అయిన 64 శాసనసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ కోవలోనే మన తెలుగు రాష్ట్రాలలోగానూ తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీకి కూడా అక్టోబరు 21నే ఎన్నిక జరగనుంది. ఫలితం అక్టోబరు 24న వెలువడనుంది. హుజూర్‌నగర్ స్థానం నుంచి గతేడాది ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయం సాధించారు.

అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నల్లగొండ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప-ఎన్నికలు అవసరమైంది.తెలంగాణలో ఉపఎన్నిక జరగనున్న ఏకైక స్థానం కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడు లేనంతగా హుజూర్‌నగర్‌ పై పూర్తి ఫోకస్ పెట్టాయి. ఇక పార్టీల విషయానికి వస్తే  టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో రాష్ట్ర రాజకీయమంతా అక్కడే మకాం వేయనుంది. అయితే, నోటిఫికేషన్‌ విడుదల ముందే ఉప ఎన్నిక వేడి ఊపు అందుకుంది.

ఉప ఎన్నికలో తన అభ్యర్థి కిరణ్‌రెడ్డి అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా, ఉత్తమ్‌, జానా, నేను ఒక్కటయ్యామని, పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని కోమటిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ రాజకీయం మలుపులు తిరుగుతోంది.కాంగ్రెస్‌ లో కాకరేగిన గంటల వ్యవధిలోనే అధికార టీఆర్ఎస్‌కు చెందిన శంకరమ్మ రేసులో తానూ ఉన్నానంటూ ముందుకు వచ్చారు.

కేసీఆర్‌ తనకు టికెట్ ఇస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోసం ప్రయత్నిస్తానని శంకరమ్మ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్‌లో కలవరం మొదలైంది. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పేరు దాదాపు ఖరారయ్యింది. దీనిపై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటన కూడా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: