చిత్తూరు టీడిపి మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల శివప్రసాద్ అకాల మరణంతో తీవ్ర శోక సంద్రంలో ఉన్న టీడిపి శ్రేణులకు ఇప్పుడు శివ‌ప్ర‌సాద్ మృతి కూడా పెద్ద షాకే అని చెప్పాలి. ఇక పార్టీలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే శివ‌ప్ర‌సాద్ మృతిని పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు చిత్తూరు ఎంపీగా గెలిచిన ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి రెడ్డ‌ప్ప చేతిలో ఓడిపోయారు.


ఇక ఈ ఎన్నిక‌ల్లోనే ఆయ‌న అల్లుడు న‌ర‌సింహాప్ర‌సాద్ సైతం క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక స్వ‌త‌హాగా న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన శివ‌ప్ర‌సాద్‌కు చంద్ర‌బాబుకు మ‌ధ్య యూనివ‌ర్సీటీ నుంచే స్నేహం ఉంది. ఇక‌ రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా శివప్రసాద్ వ్యవహరించిన తీరును ఏపి ప్రజలు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోరు. అప్ప‌ట్లో పార్ల‌మెంటులో శివ‌ప్ర‌సాద్ చేసిన విన్యాసాల‌కు నాటి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్ సైతం నవ్వుకున్న సందర్బాలు ఉన్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రధాని మోదీ సైతం ఓ సందర్బంలో ప్రస్తావించారు.


తాను ప్ర‌తిప‌క్షాలు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఎలా ఆన్స‌ర్ చేయాలా ? అని అనేక ఒత్తిళ్ల‌తో స‌భ‌కు వ‌స్తుంటాన‌ని.. అయితే ఎంపీ శివ‌ప్ర‌సాద్ వేషాలు, హావభావాలు చూసి నవ్వుకుంటానని స్వయంగా ప్రధాని మోదీ గుర్తు చేసారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కూడా ఆయ‌న అప్ప‌డు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్య‌తిరేకంగా ఎన్నో స్కిట్‌లు వేశారు. రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌తో పాటు ఏపీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ? అన్న‌ద‌మ్ముల‌ను విడ‌దీస్తే వ‌చ్చే క‌ష్ట‌, న‌ష్టాలు త‌న వేష‌ధార‌ణ‌ల‌తోనే వివ‌రించారు.


సోనియాగాంధీకి వ్య‌తిరేకంగా ఎన్నో పాట‌లు పాడిన ఆయ‌న అప్ప‌ట్లో కాంగ్రెస్ ఎంపీలతో కాస్త ఘర్షణ పూరిత వాతావరణానికి కూడా శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ ఆవరణలో అడాల్ప్ హిట్లర్ గా, తాంత్రికుడుగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గా అనేక వేషాలతో సాటి ఎంపీలను అలరించారు శివప్రసాద్. ఆయ‌న విచిత్ర‌మైన వేషాల నిర‌స‌న‌ల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: