చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శివప్రసాద్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల సమయంలో చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శివప్రసాద్ ప్రముఖుల వేషధారణలో డైలాగులు చెబుతూ గతంలో పార్లమెంటు ప్రాంగణంలో హైలెట్ గా నిలిచారు. అల్లూరి సీతారామరాజు వేషంలో ఒకసారి, శ్రీ కృష్ణుడిలా మరోసారి, హరిదాసు వేషంలో మరోసారి, స్వామి వివేకానంద వేషంలో మరోసారి శివప్రసాద్ కనిపించారు. 
 
శివప్రసాద్ గతంలో ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలని, విభజన బిల్లులోని హామీలను నెరవేర్చాలని కోరారు. ఎన్నో వేషాలు వేసి శివప్రసాద్ ప్రత్యేకహోదా కావాలని పోరాటం చేశారు. నియంత హిట్లర్ వేషంలో, ట్రాన్స్ జెండర్ వేషంలో కూడా శివప్రసాద్ పార్లమెంటు ప్రాంగణంలో డైలాగులు చెప్పారు. 16వ లోక్ సభ చివరి సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీ శివప్రసాద్ మంచి నటుడని కితాబిచ్చారు. 
 
సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా శివప్రసాద్ వేషధారణ చూడగానే అన్నీ మరిచిపోతానని మోడీ గతంలో వ్యాఖ్యలు చేశారు. 1951 సంవత్సరం జులై 11వ తేదీన చెంగమ్మ, నాగయ్య దంపతులకు మద్రాస్ రాష్ట్రంలో శివప్రసాద్ జన్మించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో శివప్రసాద్ వైద్య విద్యను అభ్యసించారు. 2009, 2014 సంవత్సరాల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి శివప్రసాద్ విజయం సాధించారు. 
 
2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో శివప్రసాద్ ఓడిపోయారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమా రంగంలో కూడా శివప్రసాద్ తననటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క మగాడు, కుబేరులు, మస్కా, ఆటాడిస్తా, తులసి, దూసుకెళ్తా, డేంజర్, కితకితలు మొదలగు సినిమాల్లో శివప్రసాద్ నటించారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: