ఆయ‌న రాజ‌కీయ విల‌క్ష‌ణ న‌టుడు! టీడీపీలో సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాలు చేసిన నేత. రాజ‌కీయ శ‌త్రువులు లేని నిజ‌మైన నేత‌గా ఎదిగారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా అంద‌రిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌నే నార‌మిల్లి శివ‌ప్ర‌సాద్‌. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన శివ‌ప్ర‌సాద్‌.. అధినేత మాట‌కు క‌ట్టుబ‌డిన నాయ‌కుడిగా, పార్టీలో అవ‌స‌ర‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఏ స‌మ‌స్య‌పైనైనా త‌న‌దైన శైలిలో స్పందించ‌డం శివ‌ప్ర‌సాద్ విల‌క్ష‌ణ వ్య‌క్తిత్వానికి మ‌చ్చుతున‌క‌. 1951లో చిత్తూరు జిల్లా పుటిప‌ల్లిలో జ‌న్మించిన ఆయ‌న నాట‌కాల ద్వారా రంగ ప్ర‌వేశం చేశారు.


అనంత‌రం విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌కు చేరువైన ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం చేశారు. అనేక క్యారె క్ట‌ర్ వేషాలు వేశారు. అనంత‌రం, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌త్య‌వేడు నియో జక‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అనంతరం, ఆయ‌న స‌మాచార ప్ర‌సారశాఖ‌ల మంత్రిగా కూడా ప‌నిచేశారు. తాను ఎక్క‌డ ఉన్నా.. సౌమ్యుడిగా, ప్ర‌జ‌ల ప‌క్షాన వారి స‌మ‌స్య‌ల విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. 


రాజ‌కీయ అజాత శ‌త్రువుగా ఆయ‌న గుర్తింపు పొందారు. చ‌ణుకులు, చుర‌క‌ల‌తో ఆయ‌న మాట్లాడే తీరు మ‌రో నాయ‌కుడికి ఎక్క‌డా అబ్బ‌లేద‌నే చెప్పాలి. చిత్తూరు పార్ల‌మెంటు నుంచి వ‌రుస‌గా 2009, 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆయ‌న చంద్ర‌బాబుకు ప్రియ నేత‌గా గుర్తింపు సాధించారు. ఏదైనా స‌మ‌స్య‌పై మాట్లాడాల్సివ‌చ్చిన‌ప్పుడు త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట కౌశ‌లాన్ని ప్ర‌ద‌ర్శించేవారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ర్షించేవారు. ప్ర‌తి విష‌యాన్నీ త‌న‌దైన శైలిలో మీడియాకు వివ‌రించేవారు. 


అలాంటి నాయ‌కుడు ఇప్పుడు లేక పోవ‌డం టీడీపీకి తీర‌నిలోట‌నే చెప్పాలి. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు చేసినా.. త‌ర్వాత కాలంలో తాను ఎందుకు చేసిందీ చెప్పుకొని మీడియా ముందు బాధ‌ప‌డిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఇలా త‌న రాజ‌కీయ జీవితాన్ని, న‌ట‌నా జీవితాన్ని కూడా మిక్స్ చేసిన విల‌క్ష‌ణ నేత ఇక లేర‌నే వార్త టీడీపీని శోకంలో నింపేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: