హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం అవకాశమిచ్చారు. గ‌తంలో ఓట‌మి చెందిన సానుభూతి సైదిరెడ్డికి అక్క‌ర‌కు వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో మ‌రోమారు కేసీఆర్ సైదిరెడ్డి వైపు మొగ్గు చూపిన‌ట్లు తెలిసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల న‌గ‌రాను మోగించింది.


పీసీసీ అద్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డంతో  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అక్టోబరు 21న పోలింగ్‌ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.పీసీసీ అధ్య‌క్షుడు, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య‌ ప‌ద్మావ‌తి ని హుజూర్‌న‌గ‌ర్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్నది. ఇక టీఆర్ ఎస్ నుంచి సైదిరెడ్డి ఎంపిక కావ‌డంతో ఇక క‌మ‌లం నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో తేలాల్సి ఉంది. బీజేపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే హుజూర్‌న‌గ‌ర్‌లో ముక్కోణపు పోటీ త‌ప్ప‌దు.


అయితే ఇక్క‌డ కాంగ్రెస్‌కు, టీ ఆర్ ఎస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక్క‌డ పాగా వేయాల‌ని గ‌తంలోనే టీ ఆర్ ఎస్ ప్ర‌య‌త్నాలు  చేసింది. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాల‌ని కేసీఆర్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ఓడించ‌డం కేసీఆర్ వ‌ల్ల కాలేక‌పోయింది. ఇక టీ ఆర్ ఎస్‌కు హుజూర్ న‌గ‌ర్‌లో స్థానం లేద‌ని నిర్ణ‌యించుకునే స‌మ‌యంలోనే ఉప ఎన్నిక వ‌రంగా మారింది. ఇక్క‌డ పీసీసీ అధ్య‌క్షుడి భార్య‌ను ఓడిస్తే నైతికంగా కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టొచ్చ‌ని కేసీఆర్ పావులు క‌దుపుతున్నాడ‌ట‌.


అందుకే అభ్య‌ర్థిని మార్చ‌కుండా గ‌త ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ చేతిలో ఓడిపోయిన సైదిరెడ్డినే బ‌రిలోకి దింపుతున్నారు. సైదిరెడ్డి గ‌తంలో ఓడిపోయాడ‌నే సానుభూతి ఈ ఉప పోరులో లాభించ‌నున్న‌ద‌ని టీ ఆర్ ఎస్ వ‌ర్గాల క‌థ‌నం. ఇక ఇక్క‌డ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డికి ఈ ఎన్నిక మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో ఈ సీటుపై అటు రేవంత్‌రెడ్డి వ‌ర్గం క‌న్నేసింది. దీంతో కాంగ్రెస్‌లో వ‌ర్గ‌పోరు భ‌గ్గుమంటున్న త‌రుణంలో ఇటు ఇంటిపోరు బాగానే ఉంది. మ‌రోవైపు టీ ఆర్ ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్య‌ర్థి సైదిరెడ్డి బ‌రిలో ఉండ‌టంతో సానుభూతి ప‌వ‌నాలు వీస్తాయ‌నే భ‌యం ఉత్త‌మ్‌కు పట్టుకుంది.


ఓవైపు సొంత పార్టీలో కుంప‌టి.. మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థి. ఈ రెండింటిని త‌ట్టుకుని ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి త‌న భార్య‌ను ఎలా గెలిపించుకుంటాడో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ ఎన్నిక ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజ‌కీయ జీవితానికే ఓ ఆగ్నిప‌రీక్ష లాంటిది. అయితే ఇంత‌కు ముందు త‌న భార్య ప‌ద్మావ‌తిని కోదాడ నుంచే గెలిపించుకోలేక పోయిన ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు త‌న సొంత ఇలాఖాలో ఎలా గెలిపించుకుంటాడో వేచి చూడాల్సిందే. ఇక బీజేపీ కి ఇంకా బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. బీజేపీ ఈ ఉప పోరులో త‌న స‌త్తా చాటాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేయనున్న‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ త్రిముఖ పోటీలో స‌త్తా ఎవ‌రిదో ఏంటో అక్టోబ‌ర్ 24న తేల‌నున్న‌ది.



మరింత సమాచారం తెలుసుకోండి: