కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఓ టీడీపీ సీనియర్ నేత కనుమరుగు కానున్నాడు. ఎప్పుడు జిల్లా మీద పెత్తనం చేద్దామనుకునే మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన రాజకీయాలకు ఆ నేత బలైపోయాడు. ప్రస్తుతం ఆ నేత పూర్తిగా సైలెంట్ గా ఉంటూ...పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇంతకి ఉమా రాజకీయాలకు బలైపోయిన ఆ సీనియర్ నేత ఎవరో కాదు...పెడన మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వచ్చిన కాగిత 1985,1994, 1999 ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, 1989. 2004లో ఓడిపోయారు.


ఇక నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్లేశ్వరం కాస్తా పెడనగా మారింది. 2009లో పెడన నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాగిత...2014 ఎన్నికల్లో గెలిచారు. అయితే అంతకముందు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాగితకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో 2014లో టీడీపీ అధికారంలోకి రావడం...నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో...మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. కృష్ణా జిల్లా టీడీపీలో తానే నెంబర్ 1 లీడర్ అని ఫీల్ అయ్యే దేవినేని ఉమా...అంతర్గత రాజకీయానికి తెరలేపారు. కాగితకు మంత్రి పదవి రాకుండా చేశారు.


తొలిసారి బందరు నుంచి గెలిచిన కొల్లు రవీంద్రకు పదవి వచ్చేలా పావులు కదిపారు. దీంతో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజు తన పేరు లేకపోవడంతో కాగిత...షాకుకు గురయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన ఆయన గుండెనొప్పితో హాస్పిటల్ పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా కాగిత పేరు లేదు. అలా దేవినేని ఉమా రాజకీయాలకు బలైన కాగిత...ఐదేళ్లు ఎమ్మెల్యేగానే కొనసాగారు. అయితే మంత్రిపదవి దక్కలేదనే దిగులో లేక వయసు మీద పడటమో కానీ...కాగిత ఆరోగ్యం దెబ్బతింది.


దీంతో మొన్న ఎన్నికల్లో తన తనయుడు కాగిత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇప్పించి పోటీకి దింపారు. కానీ కృష్ణప్రసాద్ ఓటమిపాలయ్యారు. అటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని పోగొట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాగిత పార్టీలో యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం పెడన నియోజకవర్గంలో టీడీపీ ఉందా? లేదా? అన్నట్లుంది. మొత్తానికైతే కాగిత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం కష్టమే. ఏది ఏమైనా దేవినేని రాజకీయాలకు టీడీపీ ఓ సీనియర్ నేతని మిస్ కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: