మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమితో చాలామంది టీడీపీ సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్తు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇవే చివరి ఎన్నికలు అన్నట్లు బరిలో దిగిన నేతలు...ఊహించని విధంగా ఓడిపోవడంతో....రాజకీయాలకు దూరమైపోయారు. రాష్ట్రంలో చాలామంది నేతలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. అందులో కృష్ణా జిల్లాలో సీనియర్ గా ఉన్న కాపు నేత మండలి బుద్ధప్రసాద్ రాజకీయ జీవితానికి కూడా శుభం కార్డు పడినట్లే అనిపిస్తోంది.


ఇటీవల ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బుద్దప్రసాద్...సమాజ సేవకుడు, కాంగ్రెస్ నాయకుడు దివంగత మండలి వెంకట కృష్ణారావు తనయుడుగా....రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు బాషా ప్రియుడైన బుద్దప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1999,2004 ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచారు. ఇక 2007-2009 కాలంలో వైఎస్సార్ కేబినెట్ లో పశుసంవర్థక, పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశారు.


ఆ తర్వాత 2009లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇక తెలుగు బాషా మీద అభిమానంతో 2012లో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి... మండలికి ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పదవి ఇచ్చారు. ఆయన హయాంలోనే 2012లో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనని నిరసిస్తూ....ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఆ వెంటనే 2014 జరిగిన ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించారు.


సీనియర్ నేతగా ఉండటంతో చంద్రబాబు....మండలికి డిప్యూటీ స్పీకర్ పదవి బాధ్యతలు అప్పగించారు. ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు రాష్ట్రంలో కూడా టీడీపీ ఘోరంగా ఓడటంతో మండలి అడ్రెస్ లేరు. పార్టీలో కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. వయసు కూడా మీద పడటంతో ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్తితులన్నీ చూస్తుంటే మండలికి ఇవే లాస్ట్ ఎన్నికలు అనిపిస్తున్నాయి. ఇంతటితో మండలి రాజకీయ జీవితానికి శుభం కార్డు పడిపోయినట్లే అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: