కృష్ణా ఆయకట్టు, రాయలసీమ ను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాయలసీమ లో ప్రతి డ్యాము ను నీటితో నింపుతానన్నారు. శనివారం నంద్యాల డివిజన్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టాన్ని సీఎం జగన్ పరిశీలించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ హెలిప్యాడ్ లో దిగి,  మునిసిపల్ ఆఫీసు లో వరదపై  సమాచార శాఖ  ఫోటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్బంగా అధికారులతో వరద పరిస్థితి పై   సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేవుడి దయతో రాయలసీమ లో వర్షాలు బాగా కురిశాయన్నారు. వర్షపాతం నార్మల్  అయిందన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ లోని 17 మండలాల్లో వర్షపాతం  అత్యధికంగా నమోదైందని చెప్పారు. దీని ఫలితంగా  784 కోట్ల మొత్తం నష్టం ఏర్పడిందన్నారు. 



ఆర్ అండ్ బి  రోడ్లు శిధిలమవడంతో రూ. 422 కోట్లు ,పీఆర్  రోడ్లు రూపురేఖలు కోల్పోవడంతో రూ. 103 కోట్ల మేర  నష్టం వాటిల్లిందన్నారు. అదే విధంగా పంట నష్టం 31 వేల హెక్టార్లలో దాదాపుగా రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెప్పతిన్నాయన్నారు.అధికారులు వరద ప్రాంతాల్లో పంట నష్టం, ఇతర నష్టం వివరాల సేకరణలో లిబరల్ గా మానవత్వంతో ఉండాలని సీఎం జగన్ సూచించారు. భవిష్యత్ లో కుందూ నదీ ఏరియాలో, నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వై ఎస్ స్పష్టం చేశారు. 47 సంవత్సరాల సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం 1200 ల టీఎంసీ ల నుండి 10 సంవత్సరాలలో 600 ల టీఎంసీలకు, 5 సంవత్సరాలలో 400 ల టీఎంసీలకు  శ్రీశైలం వరద ప్రవాహం పడిపోయిందన్నారు. కుందూ నదిని వెడల్పు చేసి స్థానిక వరద నష్టం నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 



దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే మధ్యలో ఆగాయి.. అయినా తిరిగి చేస్తామని చెప్పారు. వరద బాధితులను అందరినీ ఆదుకుంటామన్నారు.  రెగ్యులర్ గా ఇచ్చే వరద ఆర్థిక సాయం కంటే ప్రతి ఇంటికీ అదనంగా 2 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలని జిల్లా   కలెక్టర్ వీరపాండియన్ కు సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి ఒక్కరి మెహంలో చిరునవ్వు నింపేలా అధికారులు మానవత్వంతో పని చేసి వరద బాధితులను ఆదుకోవాలని సూచించారు. వరద బాధితులకు ఇళ్లను నిర్మించి ఇస్తామని సీఎం చెప్పారు. ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే సాయంత్రం వరకు ఉండి సమీక్ష చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: