గ‌త కొద్దికాలంగా... ఎక్కువ శాతం నిరాశాజ‌న‌క‌మైన వార్త‌ల‌తోనే ఉండిపోయిన కాంగ్రెస్‌ పార్టీ అభిమానుల‌కు శుభ‌వార్త‌. ఏఐసీసీ కేంద్ర కార్యాలయం గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఢిల్లీలోని 24, అక్బర్‌ రోడ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్‌లో నూతన కేంద్ర కార్యాలయంలోకి మారనుంది. ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన డిసెంబర్‌ 28వ తేదీన పార్టీ కార్యాలయ మార్పు జరగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.


కాంగ్రెస్‌ పార్టీ ఈ నూతన కార్యాలయం సెంట్రల్‌ ఢిల్లీలోని 9, కోట్ల రోడ్‌లో ఉంది. ఆరు అంతస్థులు గల ఈ కార్యాలయానికి దివంగ‌త ప్రధాని ఇందిరా గాంధీ భవన్‌గా నామకరణం చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త పార్టీ ఆఫీసుతో త‌మ స్టార్ తిరుగుతుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే, ఆఫీసు మారితే అదృష్టం మారుతుందా అని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.


కాగా, త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా,  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా ప్రకటించారు. ఈ సందర్భంగా సునీల్‌ ఆరోరా మాట్లాడుతూ.. అక్టోబర్‌ 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండు రాష్ర్టాల్లో అక్టోబర్‌ 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికల నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 27న విడుదల కానుందని ఆయన చెప్పారు. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్‌ 4. హర్యానా అసెంబ్లీకి నవంబర్‌ 2వ తేదీతో, మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 9వ తేదీతో గడువు ముగియనుంది అని తెలిపారు. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హర్యానాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండూ కాంగ్రెస్ పార్టీకి కీల‌క రాష్ట్రాలే కావ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: