అదొక సీజనల్ ఫ్రూట్. దాని పేరు...షుగర్ యాపిల్. పేరుకే కాదు...టేస్ట్ లో దీ బెస్ట్. పండుగా తిన్నా....జెల్లీగా జుర్రేసినా....ఐస్ క్రీమ్ గా లాగించినా....ఆ రుచి అమోఘం. కార్పోరేట్ కంపెనీల ఫోకస్ పెరగడంతో ఇప్పుడీ మధుర ఫలం డిమాండ్ అధికమైంది. ఉత్తరాంధ్ర నుంచి రికార్డ్ స్థాయిలో ఎగుమతి అవుతోంది. 


సీజన్‌ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో  ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్టు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతుంది సీతాఫలం. అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. పోషకాల సమాహారం సీతాఫలం మూడు నెలలకు పైగా లభిస్తుంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల నుంచే సీతాఫలం అమ్మకాలు జరుగుతున్నాయి. రాజమండ్రి  తర్వాత స్థానాన్ని విశాఖ ఏజెన్సీకి ముఖద్వారమైన వడ్డాది మాడుగుల సొంతం చేసుకుంది. తూర్పుకనుమల్లో పండే సీతాఫలం సైజుతో పాటు రుచిలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది.   


కేవలం రుచికే కాదు మెరుగైన పోషకాలకు పెట్టింది పేరు. శరీరంలో కండర వ్యవస్థకు .. నులిపురుగుల నివారణకు  తోడ్పడుతుంది. పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేస్తుంటారు. తినుబండారాలలో సీతాఫలాల వినియోగం పెరగడంతో డిమాండ్ అధికమైంది. ఈ ఏడాది సీతాఫలాలు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. గత ఏడాది  ధరలు పోల్చిచూస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీజన్ ముగింపునకు రెండు నెలల సమయం ఉండగానే ధరలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి.  


సీజన్ ప్రారంభంలోనే సీతాఫలాలు అమ్మకాలు ఉపందుకున్నాయి. మాడుగుల మండల కేంద్రానికి దగ్గర లో ఉండే దేవపురం, సలుగు, దప్పాడ, హనుమంతుపురం, కామగెడ్డ పులుగు, పులుసుమామిడి  గ్రామాలను నుంచి కాలి నడకన గిరిజన రైతులు సీతాఫలాలు  అమ్మాకానికి తీసుకొస్తారు. కావిడి ధర  2 వేల రూపాయల వరకు, పెద్ద సైజ్ ఫలాలు అయితే 2,200 వరకు ధర పలుకుతోంది. మాడుగుల లో లభ్యమయ్యే సీతాఫలాలు ఇతర రాష్ట్రాలైన ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, చెన్నై కలకత్తాకు ఎగుమతి అవుతున్నాయి. ప్యాకింగ్ చేసి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు వ్యాన్ ల ద్వారా తరలిస్తారు.  ఐతే దళారి వ్యవస్థ వలన తమకు గిట్టుబాటు ధర లభించలేదని వాపోతున్నారు అమ్మకం దారులు. సరైన రహదారులు లేక వాగులు వంకలు దాటి సుమారు 8 కిలో మీటర్లు  కాలి నడకను వచ్చినా శ్రమకు తగిన ఫలితం శూన్యమంటున్నారు గిరిజనులు.



మరింత సమాచారం తెలుసుకోండి: