గ‌త కొద్దికాలంగా, భార‌త్‌- పాకిస్థాన్ మ‌ధ్య  యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ముంబైలో నిర్వహించిన ఇండియా టుడే సదస్సులో ధనోవా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో ఎలాంటి సైనిక ఘర్షణకైనా భారత వాయుసేన సిద్ధంగా ఉన్నదని  పేర్కొన్నారు. అయితే నిర్ణయం మాత్రం రాజకీయ నాయకత్వం చేతుల్లోనే ఉన్నదని స్పష్టం చేశారు. 


పాకిస్థాన్‌ ఇటీవల చేస్తున్న ‘అణు’ ప్రగల్భాలపై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా స్పందిస్తూ.. ఎలాంటి సైనిక ఘర్షణకైనా భారత వాయుసేన సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఎప్పుడు? అనేది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. యుద్ధం మొదలైతే ఏకపక్షంగా సాగుతుందని చెప్పారు. ‘ప్రగల్భాలు పలుకడం పాకిస్థానీయులకు అలవాటే. వారి బలం, బలగం ఏమిటో అందరికీ తెలుసు. యుద్ధం మొదలైతే ఏకపక్షంగానే సాగుతుంది’ అని స్పష్టం చేశారు. భారత్‌ వద్ద ఉన్న సుఖోయ్‌-30 యుద్ధవిమానాలు, బ్రహ్మోస్‌ క్షిపణులకు పాకిస్థాన్‌ వద్ద సమాధానమే ఉండదన్నారు. పాకిస్థాన్‌ ఎప్పుడూ భారత జాతీయ నాయకత్వాన్ని తక్కువగా అంచనా వేసిందని ధనోవా ఎద్దేవాచేశారు. 1965 యుద్ధం, కార్గిల్‌ యుద్ధ సమయాల్లో, ఇటీవలి బాలాకోట్‌ వైమానిక దాడుల సమయంలోనూ వారు కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేశారని చెప్పారు. 


మ‌రోవైపు, అభినందన్‌ తండ్రి సింహకుట్టి వర్ధమాన్‌, తాను కలిసి పనిచేశామని ధనోవా చెప్పారు. ‘నాకు అభినందన్‌ చిన్నప్పటి నుంచీ తెలుసు. అతడు పాక్‌ చేతికి చిక్కాడని తెలుసుకున్నప్పుడు నాకు కార్గిల్‌ యుద్ధం గుర్తొచ్చింది. అప్పట్లో భారత ఫ్లైట్‌ కమాండర్‌ అజయ్‌ అహూజా విమానం పాక్‌ భూభాగంలో కూలిపోయింది. ఆయన పారాచ్యూట్‌ సాయంతో దిగిన వెంటనే పాక్‌ సైనికులు ఆయన్ను కాల్చి చంపారు. అభినందన్‌ విషయంలో అలా జరగదని సింహకుట్టికి చెప్పా ను’ అని ధనోవా గుర్తుచేసుకున్నారు. పాక్ నిర్బంధంలో ఉన్నప్పుడు అభినందన్‌ ప్రదర్శించిన ధైర్యం అమోఘమని కొనియాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌ చేతికి చిక్కిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను విడిపించడంలో మన జాతీయ నాయకత్వం కృషి అమోఘమని ధనోవా ప్రశంసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: