గత పదేళ్ల పార్లమెంట్‌ సమావేశాలను పరిశీలించిన ప్రతి ఒక్కరికీ శివప్రసాద్ సుపరిచితులే. అత్యున్నత చట్టసభలో తన విచిత్ర వేషాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సమస్యలను ప్రపంచానికి ఇలా కూడా చెప్పొచ్చని తన నిరూపించారు. 
పార్లమెంట్ లో టీడీపీ నేత నటుడు శివప్రసాద్ చేసే విన్యాసాలకు సాక్షాత్తూ ప్రధానమంత్రే నవ్వుకున్న సందర్భాలున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రధాని మోదీ ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. తాను ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అనే అనేక ఒత్తిళ్లతో సభకు వస్తుంటాననీ.. ఈ క్రమంలో ఎంపీ శివప్రసాద్ వేషాలు, హావభావాలు చూసి నవ్వుకుంటానని స్వయంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు. 


ఇక రాష్ట్ర విభజన సమయంలో కూడా పార్లమెంట్ ఆవరణలో సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా ఎన్నో స్కిట్ లు చేశారు శివప్రసాద్. ముఖ్యంగా సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆయన అనేక పాటలు పాడారు, ఎన్నో వేషాలు వేశారు. ఇదే అంశంలో కాంగ్రెస్ ఎంపీలతో కాస్త ఘర్షణ పూరిత వాతావరణానికి కూడా శ్రీకారం చుట్టారు శివప్రసాద్. 2009 నుండి 2014 వరకు పార్లమెంట్ లో విభజనకు వ్యతిరేకంగా అనేక పాత్రలను పోషించారు. పార్లమెంట్ ఆవరణలో అడాల్ప్ హిట్లర్ గా, తాంత్రికుడుగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గా అనేక వేషాలతో సాటి ఎంపీలను అలరించారు శివప్రసాద్


రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, నిధుల అంశంలో కూడా అనేక విచిత్ర వేషాలు వేశారు శివప్రసాద్. 2014 నుండి గత సార్వత్రిక ఎన్నికల వరకు చిత్తూరు ఎంపీగా కొనసాగిన శివప్రసాద్ పార్లమెంట్ ఆవరణలో తను చేసే విన్యాసాల ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ దశలో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు ఇలా కూడా చేయవచ్చా అని విస్మయం కలిగేలా వ్యవహరించేవారు శివప్రసాద్. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో తాను చేసిన విన్యాసాలతో దేశ వ్యాప్తంగా నవ్వులు పూయించారు శివప్రసాద్. 


సమస్యలకు వ్యతిరేకంగా ఎన్ని విన్యాసాలు, స్కిట్ లు చేసినా జనాలు గాని, పార్టీ నేతలు గాని వినోదాన్ని పంచే కోణంలో చూశారే తప్ప ఏనాడూ శివప్రసాద్ మనో వేదనకు ప్రాముఖ్యత ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల అంశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన విన్యాసాలను కూడా బీజేపి కేంద్ర మంత్రులు అలాగే భావించారని చెప్పాలి. 
తెలుగుదేశం సీనియర్ నేతగా పలు పదవులను నిర్వహించిన శివప్రసాద్, 2009, 2014లలో చిత్తూరు ఎంపీగా గెలిపొందారు. 1999-2004 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.


గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్ ఇకలేరన్న విషయం తెలుసుకున్న అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. శివప్రసాద్ మృతిపై స్పందించిన చంద్రబాబు.. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం శివప్రసాద్ రాజీలేని పోరాటం చేశారనీ, ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: