ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ నేత కేసీఆర్ సార‌థ్యంలోని టీఆర్ఎస్ ఇంకో ప్ర‌త్యేక‌త‌ను సృష్టించ‌డం ఖాయంగా ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ తాలూకా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం యువకులు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు. జై తెలంగాణ , జై మహారాష్ట్ర, జై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు.


హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నాయకులు భేటీ కావడంతో....మహారాష్ట్రలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపకల్పనలో అక్కడి నాయకులు నిమగ్నమయ్యారు. ధర్మాబాద్‌లోని గుజరాత్‌ కాలనీ దేవీరోడ్డు మార్గంలో ఇటీవల ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో.. శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. స్వీట్లు పంచుకొన్నారు. అనంతరం ధర్మాబాద్‌ పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.


కాగా,నాందేడ్ జిల్లాకు చెందిన నయ్‌గావ్, భోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.  తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని ఉద్యమం నిర్వహించిన బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో వారు ముఖ్యమంత్రికి తమ సమస్యలను వెల్లడించారు. తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి, తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని గతంలో ధర్మాబాద్ తాలూకాకు చెందిన 40 గ్రామాల ప్రజలం తీర్మానం చేశామని వారు చెప్పారు. దీంతో అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాల అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. వెంటనే 12 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు చెప్పినప్పటికీ, ఇవాళ్టికి కూడా ఒక్క రూపాయి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలుచేసిన కార్యక్రమాలు అమలుచేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇంతేకాకుండా...తాము టీఆర్‌ఎస్ పార్టీ టికెట్లపై పోటీచేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: