పత్రికలు, రాజకీయం ఒకదాన్ని ఒకటి పెనవేసుకుపోయిన కాలమిది. తమ నాయకుడి నోట్లో నుంచి ఏమి రావాలన్నది అజెండా డిసైడ్  చేసే స్థాయికి కొన్ని పత్రిక‌లు చేరుకున్నాక ఇక రాజకీయం ముసుగు తొలగించుకోవడమే మంచిదని కూడా మాట వినిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ రెండు పత్రికలు అంటూ నిండు సభలో నాటి సీఎం వైఎస్సార్ చెప్పుకొచ్చిన ఘటనలూ ఉన్నాయి.


ఇక నేను కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకం అంటూ ఓ ప్రధాన పత్రిక చెప్పిన సందర్భమూ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు ఏపీ రాజకీయాల్లో పత్రికల పాత్ర పూర్తి ప్రతిపక్ష పాత్రగా ఉంది. మెజారిటీ పత్రికలు టీడీపీకి అనుకూలం కాబట్టి అవి తమ రంగుటద్దాలతో చూసి రాతలు వండి వారుస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా సచివాలయ పరీక్షల్లో పేపర్ లీక్ అయిందని ఫలితాలు వచ్చిన తరువాత ఓ అనుకూల పత్రిక రాసింది. దాని మీద ఇపుడు వైసీపీ సర్కార్ నిప్పులు కక్కుతోంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకరబాబు ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ తప్పులు రాసిన ఆ పత్రికపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. 


లీకేజ్ వార్త నిజమని ఆ పత్రిక నిరూపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ నిరూపించకపోతే మాత్రం తప్పులు ఒప్పుకోవాలని అన్నారు. ఆధారాలు లేకుండా వార్తలు రాయడం పద్ధతి కాదని కూడా ఆయన అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయంలో వివరణ ఇచ్చిన తరువాత కూడా ఆ పత్రిక రాయడం అంటే ప్రభుత్వమే కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఇది లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తు. సదరు పత్రిక రాసింది తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంది. లేదా తాను రాసింది ఒప్పు అని ఆధారాలు చూపించాలసిన కర్తవ్యం కూడా ఆ పత్రిక ఉంది.


ఒకవేళ ఆధారాలు లేకుండా వార్త రాస్తే మాత్రం ఇది అభ్యర్ధుల జీవితాలతో చెలగాటం ఆడడమే. మరి దీని మీద ఆ పార్టీ  ఎమ్మెల్యే  డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం కేసు పెడుతుందా. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో చెప్పిన మాట ఒకటి ఉంది.  పత్రికలు తప్పులు రాస్తే వూరుకోం, కేసులు పెడతాం అని, దానికి అనుగుణంగా కేసులు పెడతారా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: