వైసీపీ సర్కార్ ది రివర్స్ పాలన అని ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రివర్స్ ఎన్నికలు జరిపించి ఇంటికి పంపాలని కూడా ఆయన మూడు నెలలలోనే అసహనంతో పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి రివర్స్ పాలన అంటూ విపక్షం గట్టిగా గద్దిస్తూంటే జగన్ మాత్రం ముందుకు సాగిపోతున్నారు.


రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరం పనులకు కొత్త టెండర్లు పిలిచి పదిహేను శాతం ఆదాయాన్ని ప్రభుత్వానికి, ఖజానాకు మిగిల్చిన వైసీపీ సర్కార్ అదే హుషారులో మరి కొన్ని ఇతర  ప్రాజెక్టులకు కూడా రివర్స్ టెండరింగ్ కు రంగం సిధ్ధం చేసింది. ఇపుడు తాజాగా వెలుగొండ పనులకు రివర్స్ టెండర్లు పిలిచిన వైసీపీ సర్కార్ తమ జోరు ఆగదని స్పష్టం చేసింది.  ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ టన్నెల్  2 పనులకు ఏపీ సర్కార్ తాజాగా రివర్స్ టెండర్లు పిలిచింది. 553.13 కోట్ల రూపాయల  అంచనా వ్యయంతో ఏపీ సర్కార్  ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి బిడ్ లను దాఖలు చేసుకోవచ్చునని ప్రభుత్వం స్పష్టం  చేసింది.


 
ఈ బిడ్ లను దాఖలు చేసేందుకు తుది గడువుగా అక్టోబర్ 9వ తేదీని నిర్ణయించారు. ఇక వచ్చే నెల 11న ఆర్ధిక బిడ్ తో పాటు అదే రోజున రివర్స్ ఈ-ఆక్షన్ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుందని చెబుతున్నారు. మరి రివర్స్ టెండరింగ్ విధానం బాగుందని ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.  మరో వైపు మేధావులు సైతం ఈ విధానం ద్వారా ఆదా జరుగుతుందని అంటున్నారు. వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు వంటి వారైతే పోలవరం మొత్తం పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా 600 కోట్ల పై చిలుకు సొమ్ము   ఆదా అవుతుందని చెప్పడం బట్టి చూస్తూంటే సర్కార్ జోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: