వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు జులై నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు సచివాలయ పరీక్షలు నిర్వహించి రెండు రోజుల క్రితం ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు వెరిఫికేషన్ కు హాజరు కాలేకపోయినా, హాజరై అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను చూపలేకపోయినా వారికి రెండో ఛాన్స్ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. 
 
జిల్లాల్లో భర్తీ చేసే పోస్టుల సంఖ్య మరియు రిజర్వేషన్ల ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీలు షార్ట్ లిస్టు జాబితాలను అధికారులు తయారు చేస్తున్నట్లు వివరించారు. ఎంపికైన అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ఎస్ ఎం ఎస్, ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపుతున్నట్లు తెలిపారు. షార్ట్ లిస్టులో పేరు ఉన్నవారు కాల్ లెటర్ ను వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని సమాచారం. నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కాని వారికి మరో అవకాశం ఇవ్వాలని అధికారులకు గిరిజా శంకర్ సూచించారు. 
 
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసిన అనంతరం వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న పత్రం, పదవ తరగతి లేదా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, చదువుకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, బీసీ అభ్యర్థులు తహసీల్దార్ తాజాగా జారీ చేసిన నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్, ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సెల్ఫ్ సర్టిఫైడ్ కాఫీ చూపాల్సి ఉంటుంది. 
 
స్కూల్, కాలేజీలలో చదవకుండా డైరెక్ట్ డిగ్రీ చేసిన వారు నివాస ధ్రువీకరణ పత్రం, దివ్యాంగ అభ్యర్థులు సదరం క్యాంపుల ద్వారా పొందిన మెడికల్ సర్టిఫికెట్, ఎన్ సీసీ, క్రీడల కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తూ వెయిటేజీ పొంది ఎంపికైన వారు ఇన్ సర్వీస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: