కేంద్ర ప్ర‌భుత్వం నిత్య‌వస‌ర వ‌స్తువులపై జీఎస్టీని ఏనాడో ఎత్తేసింది. కానీ ఎందుకో ఏమో గాని చింత‌పండును మాత్రం నిత్య‌వ‌స‌ర వ‌స్తువు కింద ప‌రిగ‌ణించ‌లేదో.. లేక ఏమైందో ఏందో గాని దానిపై ఇంత‌కాలం ప్ర‌జ‌లంతా ప‌న్నులు క‌డుతూనే ఉన్నారు. చింత‌పులుసు చేసుకోవాల‌న్నా ప‌న్ను క‌ట్టాలా ? అని ప్ర‌జ‌లు లోలోన కుమిలిపోతుండ‌గానే ఎందుకో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై క‌నిక‌రం చూపింది. చింత‌పండు లేనిది ముద్ద దిగ‌ద‌ని ఓ ఇంటికి ఇల్లాలు అయిన కేంద్ర మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ గ్రహించిన‌ట్లు ఉన్నారు.


అందుకే చింత‌పండుపై ఉన్న 5 శాతం జీఎస్టీని ఎత్తివేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామ‌న్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చింత‌పండుపై ఎలాంటి ప‌న్నులు లేకుండా పోయాయి.. ఇక‌ముందుకు చింత‌పండుపై ప‌న్నులు లేవు కనుక చీకుచింతా లేకుండా చింత‌పులుసు చేసుకుని క‌డుపునిండా తినొచ్చ‌న్న‌మాట‌.. ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ గోవాలో జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో ప‌లు ఆంశాల‌పై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు స‌మావేశంలో ప్ర‌స్తావించారు. దీంతో పలు వ‌స్తువులపై విధించిన ప‌న్నుల‌ను స‌వ‌రించేందుకు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి.


వీటిని సావ‌దానంగా విన్న కేంద్ర‌మంత్రి నిర్మ‌ల  జీఎస్టీ వ‌స్తువుల‌పై స‌వ‌ర‌ణ ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం, తాజాగా అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. బడ్జెట్ లో కార్పొరేట్ వర్గాలను కనికరించనట్టుగా కనిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రమంగా సడలింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు. మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

చింతపండుపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. వెట్ గ్రైండర్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతం తగ్గిస్తున్నామని చెప్పారు.
ఇక, దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నామని, భారత్ లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని నిర్ణయించామని సీతారామన్ వివరించారు. గది రూ.1000 లోపు అద్దె ఉండే హోటళ్లకు పూర్తిగా పన్ను మినహాయింపు, రూ.1000 నుంచి రూ.7500 వరకు అద్దె ఉండే హోటళ్లకు జీఎస్టీ 12 శాతం, రూ.7500 పైబడి అద్దె ఉండే హోటళ్లకు 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: