వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరిగాయి. సచివాలయ పరీక్షలకు 19,50,582 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,98,164 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు అర్హత సాధించారు. సచివాలయ పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తూ ఉండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 
 
ఈ లేఖలో వైసీపీ నాలుగు నెలల పాలనలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. సచివాలయ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరగటం వైసీపీ పాలన దుస్థితికి నిదర్శనమని అన్నారు. సచివాలయ ఫలితాల్లో అవకతవకలు జరగటం ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చ అని అన్నారు. వైసీపీ పార్టీకి చెందిన వారి స్నేహితులు, బంధువులకే మంచి మార్కులు వచ్చాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు. 
 
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మరియు వారి బంధువులకు టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, విశ్రాంత అధికారికి ఎలా చేరాయని ప్రశ్నించారు. 19 లక్షల కుటుంబాలకు ఫలితాలు వేదనను మిగిల్చాయని చంద్రబాబు అన్నారు. అవినీతికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. 
 
అవినీతికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను రద్దు చేసి  పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వమే జరిగిన అవినీతికి బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులకు సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: