తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి రంగం సిద్ధమైంది. గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ కు మళ్లించడానికి తెలంగాణ తరఫున ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. పోలవరం బ్యాక్ వాటరే మార్గమని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావించాలని డిసైడయ్యారు. 


గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే విషయంలో పోలవరం బ్యాక్‌ వాటర్‌ను తీసుకోవడమే ఉత్తమ మార్గమని  తెలంగాణ ఇంజనీర్ల కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం రెండు రాష్ట్రాల సరిహద్దు వెంట కాలువ తవ్వాలని ప్రతిపాదించింది. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలించే విషయమై నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు నేతృత్వంలోని కమిటీ సమావేశమైంది. 


ఈ నెల 23న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గోదావరికృష్ణా అనుసంధానంపై ప్రగతి భవన్‌లో సమావేశమవుతున్న తరుణంలో.. నిపుణుల కమిటీ వారికి నివేదికను ఇవ్వనుంది. సమావేశానికి ఇంజినీర్లను ఆహ్వానిస్తే ఏం చెప్పాలనే విషయాన్ని కూడా చర్చించారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఎలా తేవాలి? ఏ పాయింట్‌ నుంచి వ్యయం తక్కువ అవుతుంది? లాభదాయకత.. వంటి అంశాలపై చర్చించారు. మొత్తం నాలుగు ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 


పోలవరం బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని తరలించడమే అన్నింటికన్నా ఉత్తమ ప్రతిపాదన అని ఇంజినీర్లు అవగాహనకు వచ్చారు. దీనినే సీఎంల సమావేశంలో ప్రధానంగా వివరించాలని నిర్ణయించారు. దీని ప్రకారం పోలవరం బ్యాక్‌ వాటర్‌ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని సేకరిస్తారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కాలువ తవ్వి, నీటిని గ్రావిటీ ద్వారా పులిచింతల దిగువకు చేరుస్తారు. అక్కడి నుంచి పులిచింతల, నాగార్జునసాగర్‌, శ్రీశైలానికి నీటిని ఎత్తిపోస్తారు. ఇదే అన్నింటి కన్నా ఉత్తమ ప్రతిపాదనగా తేల్చారు. తుపాకులగూడెం ఎగువన ఒక పాయింట్‌ ద్వారా, దిగువన మరో పాయింట్‌ ద్వారా, దుమ్ముగూడెం నుంచి నీటిని సేకరించే మరో మూడు ప్రతిపాదనపైనా చర్చించారు. అయితే, గోదావరి, కృష్ణా జలాల అనుసంధానంపై ఇద్దరు సీఎంలు గతంలోనే ప్రాథమికంగా చర్చించారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌ జలాశయానికి నీటిని చేరుస్తామని కేసీఆర్‌ ఇటీవలే ప్రకటించారు. అయితే , ఇంజనీర్ల కమిటీ పోలవరం బ్యాక్‌ వాటర్‌ నుంచి సేకరించాలనే తాజా ప్రతిపాదన తెచ్చింది. దీంతో, ఈ ప్రతిపాదనపై కూడా సీఎంలు చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: