అధికారం లేకపోతే టీడీపీ పరిస్తితి ఎలా ఉంటుందో....ఈ మూడు నెలల కాలంలో పూర్తిగా అర్ధమైపోయింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో...ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట నలుగురు ఎంపీలతో మొదలైన జంపింగుల పర్వం....మొన్న తోట త్రిమూర్తులు జగన్ కి జై కొట్టేవరకు కొనసాగింది. ఇంకా ఈ వలసల పర్వం కొనసాగేలా కనిపిస్తోంది. అవకాశం దొరికితే చాలు నేతలు పార్టీ మారిపోవడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి ముగ్గురు కాపు నేతలు హ్యాండ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే మొదటి నుంచి ఈ ముగ్గురు నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది.


ఇంతకి పార్టీకి హ్యాండ్ ఇచ్చే నేతలు ఎవరో కాదు.. మొన్నటివరకు టీడీపీ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా. ఈ ముగ్గురు ఎప్పటి నుంచో పార్టీ మారిపోతారని వార్తలు వస్తున్నాయి. అయితే వీరికి తగిన అవకాశం దొరకక పార్టీ మారలేదనే తెలుస్తోంది. కానీ ఇప్పుడు వీరి చేరికకు ఆయా పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాయని తెలుస్తోంది. ఇందులో మొదట మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా పీకేయడం ఖాయమని అంటున్నారు.


ఈయన వైసీపీలోకి వెళ్లతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ గంటాని రాకుండా అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వైసీపీ అధిష్టానం నుంచి గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. కాబట్టి అతి త్వరలోనే గంటా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయం. అటు గంటా వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణ చూపు మాత్రం బీజేపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీకి ఆర్థిక స్తంభంగా నిలిచిన నారాయణ...తన వ్యాపారాలు దృష్ట్యా బీజేపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం.


ఇక బొండా ఉమా కూడా పార్టీ మారతారని కొన్నిరోజుల క్రితం బాగా ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు సర్ది చెప్పడంతో....టీడీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కానీ టీడీపీలో అంత ప్రాధాన్యత దక్కకపోవడంతో....ఉమా తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీలో చేరేందుకు చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ తో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అయితే ముగ్గురు కాపు నేతలు...బాబు షాక్ ఇవ్వడం ఖాయమని రాజకీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: