ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కావొస్తుంది. ఈ నాలుగు నెలల కాలంలో సీఎం జగన్..తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళుతున్నారు. అటు సీఎంకి తగ్గట్టుగానే కొందరు మంత్రులు కూడా పాలన వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. మరికొందరు తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న తమ శాఖపై పట్టు సాధించారు. అలా పట్టు సాధించిన మంత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) కూడా ఉన్నారు.


వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ తరుపున ఏలూరు నుంచి 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళ...ఆ తర్వాత జగన్ కోసం వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మొదట నుంచి జగన్ కు అండగా నిలబడటంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా వరించింది. రాష్ట్రంలోని కాపు నేతల్లో కీలకంగా ఉండటంతో ఆళ్ళకు పదవులు దక్కాయి.


అయితే తొలిసారి మంత్రి అయిన ఆళ్ళ...తన శాఖపై అనేక రకాలుగా సమీక్షలు చేసి...పూర్తి వివరాలని తెలుసుకున్నారు. జగన్ పాలన మార్గాలని అనుసరిస్తూ....వైద్య ఆరోగ్య శాఖలో పలు నూతన నిర్ణయాలని తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బందుల్లో పడ్డ 104, 108 సేవలని పూర్తిగా వినియోగంలోకి తెచ్చారు. వాటికి బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చారు.


అలాగే రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేసి...సేవలని మెరుగుపరిచేలా చేశారు. అటు ఆరోగ్య శ్రీలో కూడా సీఎం అధ్వర్యంలో నూతన విధానాలని తీసుకొచ్చారు. నవంబర్1 నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రదాన నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఏపీ వాసులకు ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నారు.


అలాగే ఆరోగ్య శ్రీ ప‌థ‌కంలో దాదాపు 2000ల‌కు పైగా వ్యాధుల‌ను చేర్చాల‌ని ప్ర‌తిపాదించి...దాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తన సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జనవరి 1నుంచి అమలుకి సిద్ధమయ్యారు. అదే విధంగా ప్ర‌తి వ్యాధికి రూ.1000 వ్య‌యం దాటితే అది ఆరోగ్య శ్రీ ప‌థ‌కంలోకి రానుంది. వీటితో పాటు వైద్య ఆరోగ్య శాఖలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలని ఆళ్ళ విజయవంతంగా అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.


ఇక నాని మంత్రిగానే కాకుండా ఏలూరు ఎమ్మెల్యేగా...నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకెళుతున్నారు. అటు కీల‌క‌మైన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో సైతం త‌నదైన మార్క్ చూపిస్తున్నారు. అటు అధికార నేతగా ప్రతిపక్షాలు చేసే విమర్శలని తిప్పికొట్టడంలో కూడా ముందున్నారు. మొత్తం మీద ఆళ్ళ ఆరోగ్య శాఖలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: