తెలంగాణ‌లో ఇప్పుడు అంద‌రిచూపు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ జారీ చేయ‌డంతో ఒక్క‌సారిగా ఆ నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. ఎవ‌రు గెలుస్తారు..? అనే విష‌యంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక అన్ని రాజ‌కీయ పార్టీల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారుతోంది. ఇందులో ప్ర‌ధానంగా అధికార టీఆర్ఎస్‌కు అస‌లైన స‌వాలుగానే నిలుస్తోంది.


ఇక్క‌డ గెల‌వ‌క‌పోతే.. అది ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌గా నిలుస్తుందన్న భావ‌న‌లో గులాబీ శ్రేణులు ఉన్నాయి.. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోక‌పోతే.. తెలంగాణ‌లో అయింత ప‌రువు కూడా పోతుంద‌న్న ఆందోళ‌న‌లో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. అలాగే.. ఈ ఉప ఎన్నిక‌లో గెలిచి.. 2023 ఎన్నిక‌ల‌కు బంగారు బాట వేసుకోవాల‌ని, లేనిప‌క్షంలో ఇప్పుడున్న పాజిటివ్ దెబ్బ‌తింటుంద‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ ఉంది.


ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా..నేనా.. అన్న‌ట్టుగా పోటీ ప‌డ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అయితే.. అభ్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీపీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చేతిలో స్వ‌ల్ప‌తేడాతో ఓడిపోయిన సైదిరెడ్డికే మ‌ళ్లీ సీఎం కేసీఆర్ అవ‌కాశం క‌ల్పించారు. సైదిరెడ్డి పేరును ఖ‌రారుచేయ‌గానే నియోజ‌క‌వ‌ర్గ గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.


గెలిచినంత ఆనందంలో తేలియాడుతున్నాయి. గెలుపు ఖాయ‌మ‌ని, కావాల్సింది భారీ మెజార్టీయేన‌ని అంటున్నాయి. కానీ.. గులాబీ కోట‌లో కూడా ఎక్క‌డో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఏం కొంచెం తేడా వ‌చ్చినా.. అది ప్ర‌భుత్వంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆందోళ‌న క‌నిపిస్తోంది. అందుకే ఏమాత్రమూ ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఆ పార్టీ నేత‌లు ఉన్నారు.


ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్ విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు. హ‌జూర్‌న‌గ‌ర్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో.. ఆయ‌న స‌తీమ‌ణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తికే ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కానీ.. ఇక్క‌డ టికెట్ విష‌యంలో రేవంత్ వ‌ర్సెస్ ఉత్త‌మ్ ర‌గ‌డ న‌డుస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. క‌లిక‌ట్టుగా ఉంటేమాత్రం గెలుపు ఖాయ‌మ‌న్న ధీమాలో పార్టీ నేత‌లు ఉన్నారు.


అయితే.. 2018లో వ‌చ్చిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సుమారు ఏడువేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. దీంతో ఇప్పుడు గెల‌వ‌డం అంత సుల‌భం ఏమీ కాద‌న్న విష‌యం హ‌స్తం నేత‌ల‌కు స్ప‌ష్టంగా తెలుసు. అయితే.. ఎలాగైనా.. టికెట్ మాత్రం ప‌ద్మావ‌తికే ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే.. నేత‌లు మేర‌కు క‌లిసిక‌ట్టుగా ఉంటార‌న్న దానిపైనే కాంగ్రెస్ విజ‌యావ‌కాశ‌లు ఉంటాయ‌ని చెప్పొచ్చు.


ముంద‌స్తున్న ఎన్నిక‌ల్లో పోటీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్యనే ఉంది.కానీ.. ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత బీజేపీ మ‌రింత దూకుడు పెంచింది. హుజూర్‌న‌గ‌ర్లో కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మ తొలి అమ‌రుడు శ్రీ‌కాంతాచారి త‌ల్లి, టీఆర్ఎస్ నాయ‌కురాలు శంక‌ర‌మ్మ‌ను బీజేపీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.


ఒక‌వేళ శంక‌ర‌మ్మ బీజేపీ నుంచి పోటీ చేస్తే మాత్రం.. టీఆర్ఎస్ ఓట్లు చీల‌డం ఖాయమ‌ని చెప్పొచ్చు. అంతేగాకుండా.. 2014 ఎన్నిక‌ల్లో ఆమె టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెపై సానుభూతి ఉంది. ఆమె కూడా ఎలాగైనా పోటీ చేయాల‌ని చూస్తున్నార‌ని, బీజేపీ నుంచి పోటీ చేస్తే మాత్రం ముక్కోణ‌పు పోటీ ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: