కరవు జిల్లా అనంతలో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  అన్ని ప్రాంతాల్లోనూ నీటి కుంటలు పొంగిపొర్లాయి.  జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన  వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా  భారీ వర్షం కురవడంతో వందల ఎకరాల్లో పంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అనంతపురం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అపార్ట్‌ మెంట్‌ సెల్లార్లలోకి వచ్చిన నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపింగ్‌ చేస్తున్నారు. పెనుకొండ మండలంలో దుద్దేబండ సమీపంలో వంతెన కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తడకలేరు సమీపంలో రోడ్డుపైన వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పుట్లూరు మండలంలో జాజి కొండవాగు నుంచి వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. కడవకల్లు, చింతకుంట గ్రామాల్లోకి నీరు చేరింది. మరోవైపు పుట్లూరు చెరువుకు భారీగా వర్షపు నీరు చేరుతోంది. 


ఎన్.పి కుంట మండల కేంద్రంలో రాత్రి కురిసిన మోస్తరు వర్షానికి చెరువు తూములకు చెత్త అడ్డు పడడంతో.. గ్రామంలోని ప్రధాన రహదారిపై నీరు భారీగా చేరింది. ప్రభుత్వాసుపత్రి, బస్టాండ్, గ్రామంలోకి నీరు భారీగా  ప్రవేశించి రాకపోకలకు అంతరాయం కలిగించింది ఓ మోస్తారు వర్షం. తాడిపత్రి , పెనుకొండ , ధర్మవరం, పుట్టపర్తి, నంబూల పూలకుంటలో ఐదు గంటల పాటు కుండపోత కురిసింది. ధర్మవరంలో కురిసిన వర్షంతో పలు కాలనీలలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చింది. చేనేత మగ్గాల్లోకి నీరు వచ్చి చేరింది.  పుట్లూరు, పుట్టపర్తి సమీపంలోని సాహెబ్ చెరువుకు భారీగా నీరు చేరుతుండటంతో హర్షం వ్యక్తం అవుతోంది. గాండ్ల పాడులో వందల ఎకరాలలో పంట నీట మునిగిపోయింది. జిల్లావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీటి కుంటలు చెక్ డ్యామ్ లు  నీటితో కళకళలాడుతున్నాయి. పలు చెరువుల్లో కూడా నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద మొత్తంలో పంటలు వర్షార్పణమయ్యాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: