తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన బోటు ప్రమాదంలో.. ఇంకా బోటును బయటికి తీయలేక పోతున్నారు అధికారులు. ఇప్పటి వరకు 37 మృతదేహాలు బయటకు తీశారు. మరోవైపు బోటును ఒడ్డుకు తీసుకుని రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 


గోదావరిలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద గాలింపు చర్యలు చేస్తున్న సహాయక సిబ్బందికి మృతదేహం కనిపించడంతో దానిని వారు ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు 37 మృతదేహాలు దొరకగా మరో 14 మంది ఆచూకీ తెలీలేదు.  ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77 మంది ఉండగా.. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.


రాజమండ్రిలో జాతీయ విపత్తుల నివారణ కమిటీతో సమావేశమయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.  మునిగిపోయిన బోటు బయటకు తీసే అవకాశం లేదని, కేంద్రం నుంచి అవసరమైన సాంకేతిక సహాకారాన్ని అందించి బోటు తీయడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రమాదానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. మరోవైపు మిగిలిన వారి కోసం నిరంతర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌తో పాటు  నేవీ సిబ్బంది గోదావరిని జల్లెడపడుతున్నారు. అటు ప్రమాదంలో మునిగిపోయిన బోటు... సుమారు 210 అడుగుల లోతులో ఉన్నట్టు భావిస్తున్నారు. ఏసీ క్యాబిన్‌లో మరికొంతమంది మృతదేహాలు చిక్కుకుపోయి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 


ఇంకా 14మంది జాడ తెలియకపోవడంతో వాళ్లకు సంబంధించిన బంధువులు గోదావరి తీరాన కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వాళ్లంతా జలసమాధి అయ్యారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర బతికే ఉంటారని ఆశ వారిలో ఉంది. అధికారులు తగు చర్యలు చేపట్టి ఎలాగైనా తమవారిని వెతికిపెట్టారని కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటు బోటును వెలికితీసేందుకు నిపుణులకు వాతావరణం సహకరించడం లేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: