భారీ వర్షాలు, వరదలతో ఉత్తరభారతం అతలాకుతలమవుతోంది. గంగ, యమున నదులు వరదలతో నిండుకుండలా మారాయి. ప్రయాగరాజ్‌ లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. భారీవర్షాల హెచ్చరికలతో అటు ముంబై సైతం వణికిపోతోంది.


ఉత్తరాదిన కురుస్తోన్న భారీ వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. కుండపోత వర్షాలతో పెద్ద ఎత్తున  వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తీరప్రాంతాలు  జలదిగ్బంధమయ్యాయి. గంగా, యమున నదుల్లో భారీగా వరద నీరు చేరడంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భవనాలు సగం వరకు  నీటమునిగాయి. నదుల్లో వరదనీరు పోటెత్తడంతో నదుల పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.


ఉత్తరప్రదేశ్ లో గంగ, యమున నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా వారణాసి, అలహాబాద్  జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. గంగ, యమున నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద  ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలనీ.. అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్  ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.


యమున నది పొంగి పొర్లుతుండడంతో బుందేల్ ఖండ్ రీజియన్ తో పాటు హమీర్పూర్, బందా, చిత్రకూట్ జిల్లాల్లో పలు ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. యమునతో  పాటు కెన్, బెట్వా నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కొద్ది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం  స్తంభించిపోయింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. రోడ్లు తెగిపోయాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలో ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారం 14మంది మరణించినట్టు సమాచారం.  మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రకటించారు.


అటు...వాణిజ్య నగరం ముంబై వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాబోయే 48 గంటల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబై, రాయ్  గడ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబయిలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలను మూసివేశారు. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. నిజానికి...రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమమవుతున్నాయి. విమానాలు, రైళ్ల  రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఐతే...ఈ పరిస్థితి నుంచి ఉత్తర భారతదేశం బయటపడటానికి ఇంకొద్ది రోజులు పట్టే  అవకాశం కనిపిస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: