సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నవాళ్లే నేటి సమాజంలో అసలైన భాగ్యవంతులని.. అలాంటి భాగ్యాన్ని పొందేందుకు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి ఆరోగ్య రక్షణపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో స్వర్ణభారతి ట్రస్టు, కిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఉపరాష్ట్రపతి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సమస్యలకు చికిత్స చేసుకోవడం కన్నా నివారణే ముఖ్యమని ఈ దిశగా ప్రజలంతా దృష్టిపెట్టాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమనేది భారతీయ సంస్కృతిలో భాగమని ఉపరాష్ట్రపతి అన్నారు. మన పూర్వీకులు కూడా ఆరోగ్యమస్తు, ఆయుష్మాన్ భవ అని వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని దీవించేవారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్య పరీక్షలు, చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే స్వర్ణభారతి ట్రస్టు ద్వారా వివిధ ఆసుపత్రుల సౌజన్యంతో 2001 నుంచి నేటివరకు 250కు పైగా వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఉపరాష్ట్రపతి వెల్లడించారు.



స్వర్ణభారత్ ట్రస్ట్ నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ శాఖల్లో తరచుగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి వైద్య శిబిరంలో భాగస్వామ్యమైన కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులను ఆయన అభినందించారు. నేటి యువత ఉరుకులు, పరుగులు నిండిన జీవితాలతో.. డబ్బు సంపాదన చట్రంలో పడిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారని..ఇది ఎంతమాత్రమూ సరికాదన్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యం ఆ దేశ ఆర్థికాభివృద్ధిని శాసిస్తుందని.. ఆరోగ్యకరమైన సమాజంలో భాగస్వామ్యం కావడం ద్వారా.. వైద్యంపై పెట్టే ఖర్చును ఇతర రంగాలకు మళ్లిస్తే.. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు ప్రధాన రంగాలకు పార్లమెంట్, రాజకీయ పార్టీలు, పత్రికలు, ప్రభుత్వాలు పెద్ద పీట వేసి, ప్రాధాన్యత ఇవ్వాలని.. ఈ రంగాల్లో పురోగతి విషయంలో కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేకుండా అందరికీ సమాన బాధ్యత ఉంటుందని ఉపరాష్ట్రపతి సూచించారు.



దేశభవిష్యత్తు అయిన చిన్నారులకు ఇప్పటినుంచే ముందుజాగ్రత్త చర్యల గురించి బోధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అన్ని వైద్య కళాశాలలు, వైద్య సంస్థలు బాధ్యతగా తమ దగ్గర్లో ఉన్న విద్యాలయాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధి నివారణ, ఆరోగ్య సూత్రాలు, ముందు జాగ్రత్త చర్యలు, జీవనశైలిపై సమగ్ర అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కేన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (అసంక్రమిత వ్యాధులు) తీవ్రత పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని.. అందుకే మనం ముందుజాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఆహార నియమాల్లో మార్పులు, నిత్యం వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ఇలాంటి సమస్యలనుంచి కొంతమేరనైనా దూరంగా ఉండొచ్చని సూచించారు. మొబైల్ ఫోన్, కంప్యూటర్లు, ఆటోమేటిక్ మెషీన్ల వంటి సాంకేతికత పెరుగుతున్న కొద్దీ శారీరక వ్యాయామాన్ని పూర్తిగా పక్కనపెడుతున్నామన్న ఉపరాష్ట్రపతి.. వీటిని అవసరమున్నంతవరకే వినియోగించుకోవాలని సూచించారు.



తిండిపైనా వ్యామోహం పనికిరాదని ఉపరాష్ట్రపతి సూచించారు. మన పూర్వీకులు మన కోసం ఓ ప్రత్యేకమైన జీవన విధానంతో పాటు, ఆహారనియమాలను ఏర్పాటు చేశారని.. కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆహారంలో మార్పులను సూచించారని ఆయన గుర్తుచేశారు. అందరితో కలిసి పంచుకోవడం (షేర్ అండ్ కేర్ సంస్కృతి) ద్వారా మన పూర్వీకులు చక్కని జీవన విధానాన్ని గడిపారని.. మనం కూడా అదే జీవన విధానాన్ని అనుసరించి.. మన శారీరకంగా ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలన్నారు. ప్రకృతితో కలిసి జీవించడాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని ఇదే ఆరోగ్యకరమైన జీవితానికి రాచబాట వేస్తుందన్నారు. ఆరోగ్య భారతమే శక్తివంతమైన భారత్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: