ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి మూడు రోజుల క్రితం ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జిల్లాల వారీగా మెరిట్ జాబితా పని నిన్నటికి కూడా కొలిక్కి రాలేదని తెలుస్తుంది. మార్కులు, ర్యాంకుల వివరాలు జిల్లాలకు సకాలంలోనే వెళ్లినా చాలా జిల్లాల్లో మెరిట్ లిస్టు బయటకు రాలేదని తెలుస్తోంది. 
 
ముందుగా అధికారులు చేసిన ప్రకటనల ప్రకారం ఇప్పటికే జిల్లాల వారిగా మెరిట్ లిస్టు ప్రకటించటంతో పాటు పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్ లోడ్ చేసిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కావాల్సి ఉంది. పురపాలక శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు 13 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తరువాత పనులలో వేగం పెరిగిందని తెలుస్తోంది. 
 
చాలా జిల్లాల్లో ఇంకా రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా, రిజర్వేషన్, మార్కులు తయారు చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. ఈరోజు ఉదయానికి అన్ని జిల్లాల్లో మెరిట్ లిస్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పేర్లు ఉన్నవారంతా సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయటంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరయ్యే విధంగా జిల్లా యంత్రాంగాలు సమాచారం అందించబోతున్నాయని తెలుస్తోంది. 
 
3 రోజుల సర్టిఫికెట్ల పరిశీలన తరువాత అధికారులు నియామక ఉత్తర్వులను అందించటం జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయ వెబ్ సైట్ లో ఎంపికైన అభ్యర్థుల సమాచారాన్ని పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రతిభావంతుల జాబితాలను వెబ్ సైట్ లో పెట్టే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. నిన్న కొన్ని ప్రాంతాలలో ఏ ఎన్ ఎం లు ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్నప్పటికీ సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మార్కులు కలపలేదని ఆందోళనకు దిగారని సమాచారం. మాజీ సైనికులు అర్హత మార్కుల్లో రిజర్వేషన్ అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: