మార్కెట్లో ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉల్లి కొనాలనుకునే వినియోగదారులకు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలతో సామాన్యులు తీవ్రంగా అసహనానికి గురవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలోని మార్కెట్లలో ఉల్లి రేటు క్వింటా 3,500 రూపాయల నుండి 4,500 రూపాయల వరకు పలుకుతోంది. కర్నూలు జిల్లాలో ఉల్లి ధర క్వింటా 3,000 రూపాయలకు పైగా పలుకుతోంది. 
 
దాదాపుగా ప్రతి ఇంట్లో కూరల కోసం ఉల్లి తప్పనిసరిగా అవసరం. రైతు బజార్లలో కిలో ఉల్లి 32 రూపాయల నుండి 36 రూపాయలకు విక్రయిస్తూ ఉండగా మార్కెట్లో ఉల్లి క్వాలిటీని బట్టి 40 రూపాయల నుండి 60 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి రేటు మార్కెట్లో 70 రూపాయల వరకు పలుకుతోందని సమాచారం. సాధారణంగా ఉల్లి ఎక్కువగా మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుంది. 
 
కానీ వరదల వలన ఈ రాష్ట్రాలలో ఉల్లి పంట ఉత్పత్తి తగ్గటంతో ఈ సంవత్సరం ఉల్లి పంట సరఫరా తగ్గింది. ప్రస్తుతం రాయలసీమలోని కర్నూలు మార్కెట్ కు మాత్రం ఉల్లి నామమాత్రంగా వస్తోందని సమాచారం. డిమాండ్ కు సరిపడే విధంగా ఉల్లి ఉత్పత్తులు లేకపోవటం వలనే ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి కొద్దికొద్దిగా మార్కెట్ కు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. 
 
వినియోగదారులకు సరిపడేంత ఉల్లి ఉత్పత్తి కావటానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. హైదరాబాద్ ఉల్లి వ్యాపారులు ఉత్తరాది రాష్ట్రాల నుండి ఉల్లి రవాణా పెరిగితే ఉల్లి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగటంతో వినియోగదారులు తక్కువ మొత్తంలో ఉల్లి కొనుగోలు చేస్తున్నారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: