ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఈరోజు ఉదయం నాన్ టీచింగ్ ఉద్యోగులు కాసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ గేట్లకు తాళాలు వేసి నిరసన గళం విప్పారు. తమ ప్రమోషన్లు, జీతాల పెంపు నిలిపివేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తప్పు పట్టారు. గత ప్రభుత్వ హయాంలో యదావిధిగా కొనసాగిన నిర్ణయాలను కొత్త ప్రభుత్వం నిలిపివేయడం తగదన్నారు. దీంతో తాము నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి యూనివర్శిటీలో రిటైర్డ్ అయిన వారి తర్వాతి స్థానంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చేవని అంటున్నారు. అయితే ఈ విషయంలో గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి యూనివర్శిటీలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఈ విధానాన్ని నిలుపుదల చేయాలంటూ గతంలో ఆదేశాలిచ్చింది. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాల మేరకే హయర్ ఎడ్యుకేషన్ అన్ని యూనివర్శిటీలకు అధికారిక ఉత్తర్వులిచ్చిందని సమాచారం. దీంతో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఇవే ఆదేశాలను పాటించి నాన్ టీచింగ్ ఉద్యోగుల ప్రమోషన్లు నిలుపుదల చేశారు. దీనిపై ఆగ్రహిస్తున్న ఉద్యోగులు గత మూడు రోజులుగా పెన్ డౌన్ కూడా చేశారు. ఈ అంశంపై ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కానీ వారు ప్రభుత్వ ఆదేశానుసారమే తాము నడుచుకుంటున్నామని తెలిపినట్టు సమాచారం. దీంతో ఉద్యోగస్తులు నిరసన తెలిపారు.


ఈ నిర్ణయంతో ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు ఈరోజు యూనివర్శిటీ బయట గేట్లకు తాళాలు వేసి బస్సులను అడ్డుకుని కాసేపు నిరసన తెలిపారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయాలను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. మరి ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: