అధికార టీఆర్ఎస్‌లో అసంతృప్త సెగ‌లు ర‌గులుతూనే ఉన్నాయి.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముందు.. ఆ త‌ర్వాత‌ రేగిన అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. ముందుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు సీనియ‌ర్ నేత‌, మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌తో ప్రారంభ‌మైన ఈ అసంతృప్తుల ప‌ర్వం రోజు రోజుకు కొన‌సాగుతూనే ఉంది. ఈట‌ల రాజేంద‌ర్‌, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ‌య్య, మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ఇలా ఒక్కొక్క‌రు త‌మ అసంతృప్త గ‌ళాలు వినిపిస్తున్నారు.


ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో సీనియ‌ర్ ఎమ్మెల్యే సైతం చేరిపోయారు. ఇప్పుడిప్పుడే అసంతృప్తులు సైలెంట్ అవుతున్నార‌నుకుంటున్న టైంలోనే కేసీఆర్ సామాజిక‌వ‌ర్గానికే చెందిన ఈ సీనియ‌ర్ ఎమ్మెల్యే త‌న‌కు ప్ర‌యార్టీ లేద‌ని సోమ‌వారం కంట‌త‌డి పెట్టుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా త‌న అసంతృప్తిని వెల్ల‌గ‌క్కారు. ఇటీవ‌ల కేసీఆర్ ఆయ‌న్ను పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యునిగా ఇటీవల విద్యాసాగర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.


దీనిపై ఆయ‌న అసంతృప్తిగా ఉన్నారు. సోమ‌వారం జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ త‌న‌కు కేసీఆర్ ఎలాంటి ప్రాధాన్య‌త లేని ప‌ద‌వి ఇచ్చార‌ని వాపోవ‌డంతో పాటు కంట‌త‌డి పెట్టుకున్నారు. రెండుసార్లు గెలిచినోళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన కేసీఆర్ నాలుగు సార్లు గెలిచిన త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని... ఈ ప‌ద‌వితో తాను ఏం సాధించాల‌ని కూడా ఆవేద‌న చెంద‌డంతో ప‌క్క‌నే ఉన్న వారు ఆయ‌న్ను ఓదార్చారు.


అయినా త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు వ‌ద్ద‌ని... తాను ఎమ్మెల్యేగానే ప్ర‌జాసేవ చేసుకుంటాన‌ని కూడా చెప్పారు. ఇక రెండో విడ‌త మంత్రి వ‌ర్గంలో ఆయ‌న త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే వెల‌మ సామాజిక‌వ‌ర్గంలో ఇప్ప‌టికే చాలా మంది మంత్రులు ఉన్నారు. ఇక క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనే ఏకంగా న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ జిల్లాల్లో అసంతృప్తుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. ఇక విద్యాసాగ‌ర్‌రావు విషయంలో గులాబీ బాస్ ఎలా ? రియాక్ట్ అవుతారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: