కర్ణాటకలో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల భవిష్యత్తును తేల్చనుంది సుప్రీం కోర్టు.  స్పీకర్ తీసుకున్న అనర్హత నిర్ణయంపై తీర్పు వచ్చేంత వరకు ఉపఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలని ఈసీకి సూచించింది ధర్మాసనం.  స్పీకర్ తమపై చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని అనర్హతవేటు పడ్డ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.


కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న కారణంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించి మొత్తం 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్  కుమార్. అనర్హత వేటు పడటంతో  ఉపఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోయారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా  17 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు పరిశీలనలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం... కర్ణాటకలోని 15 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో వెంటనే సుప్రీం కోర్టు తలుపు తట్టారు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు.


కర్ణాటక ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు తమను అనుమతించాలని సుప్రీం కోర్టును కోరారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. 25న దీనిపై విచారణ చేపడతామని  జస్టిస్ ఎన్.వి రమణతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. పిటిషన్లపై నిర్ణయం వెలువడే వరకు ఉపఎన్నికలను సస్పెండ్ చేయాలన్న విజ్ఞప్తిని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ ను నోటిఫై చేసిన తర్వాత  కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని వాదించారు ఈసీ తరపు న్యాయవాది.


రాజీనామా లేఖలను ఆమోదించకుండా.... అనర్హత వేటు వేశారని అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది వాదించారు. ఎల్లుండి సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే తమ కుటుంబ సభ్యులకు లేదా తాము సూచించిన వారికి బీజేపీ ఉపఎన్నికల  టిక్కెట్లు కేటాయిస్తుందన్న ఆశతో ఉన్నారు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: