పిల్లి సుభాష్ చంద్రబాస్...దివంగత వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. 1989లో రామచంద్రాపురం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాల్లోకి ఎంటరైన బోసు...2004లో కాంగ్రెస్ లో సీటు దొరకక ఇండిపెండెంట్ గా బరిలో దిగి విజయం సాధించారు. అయితే వైఎస్సార్ బోసుని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే 2009లో మరోసారి రామచంద్రాపురం నుంచి విజయం సాధించారు. అప్పుడు కూడా బోసు మీద ఉన్న నమ్మకంతో వైఎస్సార్ మంత్రి పదవి ఇచ్చారు.


అయితే ఆ తర్వాత వైఎస్ మరణించడం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో పిల్లి సుబాష్ మంత్రి పదవిని కాదనుకుని కాంగ్రెస్ ని వదిలి జగన్ వెనుక నడిచారు. అదే సమయంలో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే 2014లో అదే నియోజకవర్గం నుంచి పోటీ ఓడిపోయారు.  ఇక 2019 ఎన్నికల్లో పిల్లి రామచంద్రాపురం నుంచి కాకుండా మండపేట నుంచి పోటీకి దిగి ఓడిపోయారు. అయితే వరుసగా ఓడిపోయిన బోసుకి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అలాగే మంత్రి పదవి కూడా ఇచ్చారు.


రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు తీసుకున్న పిల్లి...అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల కాలంలో మంత్రిగా మంచి పని తీరు కనబరిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటం బోసుకి కలిసొచ్చింది. త్వరగా శాఖలపై అవగాహన పెంచుకున్నారు. అధికారం చేపట్టిన వెంటనే తప్పుల తడకలుగా ఉన్న భూ రికార్డులని సరిచేసే పనిలో పడ్డారు. భూ యజమానుల హక్కులను కాపాడేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


అటు ప్రభుత్వ భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఉగాది నాటికి ఇళ్ల పట్టాలని ఇవ్వనున్నారు. ఎప్పటి నుంచో వివాదాల్లో నడుస్తున్న చుక్కల భూములకు రెండు నెలల్లో పరిష్కారం మార్గం చూపించే దిశగా వెళుతున్నారు. ఈ విధం పని చేస్తూ పిల్లి సుబాష్ తన శాఖల బాధ్యతలని సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. మొత్తం మీద అతి తక్కువ కాలంలోనే పిల్లి మంత్రి పదవిపై పట్టు సాధించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: