వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ ఆయనకు కొన్ని హెచ్చరికలతో కూడిన సూచనలు చేసారు. అదమరిస్తే అంతే సంగతులు అంటూ జాగ్రత్తలు చెప్పారు. 151 సీట్లు వచ్చాయన్నది అశాశ్వితమని, అది శాశ్వతమని అనుకోవద్దని స్పష్టం చేసారు.


కాంగ్రెస్ లో అసమ్మతి ఉంటే పరిష్కరించటానికి డిల్లీ ఉందని, కానీ వైసీపీలో అన్నిటికి  రాజకీయ కేంద్రం జగన్మోహనరెడ్డి మాత్రమేనని అన్నారు. అధికార పార్టీ అధినేత గా, ముఖ్యమంత్రిగా, పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా జగన్మోహనరెడ్డి ఒక్కరే ఉన్నారని, అప్రమత్తతగానే కాదు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ చరిత్రలో రెండే సార్లు ఇదే తరహాలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని గుర్తు చేసారు.


ఏపీ చరిత్రలో ఎప్పుడు అత్యధిక ఆధిక్యతతో ఎవరు విజయం సాధించి అధికారంలోకి వచ్చినా ఆ అధినేతలపై ఏదోరకంగా తిరుగుబాట్లు జరిగాయని ఉండవల్లి గుర్తు చేసారు. ప్రజలతో పాటుగా తన పార్టీ ఎమ్మెల్యేలలో సైతం ముఖ్యమంత్రి మీద మంచి అభిప్రాయం ఉండేలా, వారు అలా దానిని కొనసాగించాలేలా చూసుకోవటానికి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన అనుక్షణం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. జగన్ చెబుతున్న నవరత్నాల్లో చిన్న తేడా వచ్చినా తన పార్టీ నేతలే వ్యతిరేకంగా పని చేస్తారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.


ప్రజల చేత ఏదురులేని రాజకీయాధికారం అందుకున్న ఎన్టీఆర్ మీద స్వయానా ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. ఇక విద్యుత్ ఛార్జీలు, ఇసుక కొరత రెండింటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.


*1972 లో కాంగ్రెస్ 51 శాతం సీట్లు సాధించి పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రి అయ్యారని ఆయన భూసంస్కరణలకు తెర తీయగానే ఆయనపైన తిరుగుబాటు మొదలైందని ఉండవల్లి అరుణ కుమార్ గుర్తు చేశారు. 

*1994 లో టీడీపీ అధినేత ఎన్టీఆర్ 294 సీట్లతో 213 సీట్లు సాధించి విజయదుంధుబులు మోగిస్తూ అధికారంలోకి వచ్చారని, ఆ సమయంలో కాంగ్రెస్ కు 26 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. సరిగ్గా 9 నెలలకే ఊహించని విధంగా చంద్రబాబు తిరుగుబాటుతో ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారని వివరించారు.

*గతంలో వైయస్ సైతం భూ సంస్కరణల దిశగా తన భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే ఆయనపైనే ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయని ఆయన మీదే కేసులు పెట్టాలని డిమాండ్ చేసాయన్నారు. ఇటువంటి వన్నీ జగన్ గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తే భవిష్యత్ ఉంటుందని ఉండవల్లి అరుణకుమార్ జాగ్రత్తలు చెప్పారు.


జగన్ తానొక్కడే కష్టపడి పార్టీని అధికారం లోకీ తీసుకొచ్చారు ప్రసంశనీయ ఈ విజయం మాత్రం శాశ్వతం కాదన్నారు. గత చరిత్ర నుండి పాఠాలు నేర్చుకున్నవాడే సరైన నాయకుడు అవుతాడని, చరిత్రలో జరిగిన రాజకీయ అపశ్రుతుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్యాపదేశంగా సూచించారు. పాలనలో చిన్న తేడా వచ్చినా కుప్పకూలి పోతారని హెచ్చరించారు. వైసీపి నేతలను కనుసన్నలలో పెట్టుకొని జాగ్రత్తగా చూసేకోవటం, వారిలో వ్యతిరేకతకు ఆస్కారం లేకుండా నడుచుకోవటం, చాలా అవసరమని వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రజల్లోనే మంచి పేరు కోసం తపిస్తున్న జగన్మోహన రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తమ మాటకు విలువ ఇస్తున్నారనే అభిప్రాయం కలిగించలేక పోతే భారీ నష్టం తప్పదని హెచ్చరించారు.


ఇప్పటి వరకు జగన్ మీద పెద్దగా ఆరోపణలు చేయాల్సిన అవసరం ఈ నాటి వరకు ఆయన పాలనలో లేదన్నారు. అవినీతి నిర్మూలిస్తానని జగన్మోహనరెడ్డి చెప్పటం సంతోషమేనని అన్నారు. పోలవరం రివర్స్ టెండర్లలో ఇంత భారీ ప్రయోజనం లభిస్తుందని తాను అనుకోలేదని, ఇన్ని కోట్లు తగ్గుతాయని తాను ఊహించ లేదు, కాని ఈ విజయం విద్యుత్ కోతల మీద ప్రజల్లో వచ్చే వ్యతిరేకత నుండి జగన్ ను రక్షించలేదని అన్నారు.


అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు హాయంలో విద్యుత్ కోతలు లేవని, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమలవుతున్న విద్యుత్ కోతల మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. దీనికి గత పాలకుల వైఫల్యాలు కారణమని చెప్పినా ప్రజలు అర్ధం చేసుకొని అంగీకరించరని అన్నారు. 


ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ఇసుక కొరత కారణంగా అనేక మంది కూలీలు ఉపాధి కోల్పోయారని, దీని మీద వ్యతిరేకత ప్రస్పుటంగా కనిపిస్తుందని చెప్పారు. అందుకే దీనిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.


 

 



మరింత సమాచారం తెలుసుకోండి: