అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప‌రువు స‌మ‌స్య‌గా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో వివిధ పార్టీల మద్దతుకోసం ఈ రెండు ప‌క్షాల నేతలు వెంపర్లాడుతున్నారు. ఇటు గులాబీ ద‌ళం, అటు హ‌స్తం పార్టీ నేత‌లు మ‌ద్ద‌తు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుండ‌గా... తెలంగాణ జన సమితి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామ‌ని, టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మ‌రోవైపు, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని సీపీఐ నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామ‌న్నారు. 


కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటికి వెళ్లి మద్దతుపై చర్చించారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని కోదండరాం దాటవేశారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంతకుముందే కలిసినప్పుడు కూడా ఆయన నేరుగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే, కోదండ‌రాం తాజాగా త‌మ పార్టీ వైఖ‌రిని ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్‌ విధానాలను ఎండగట్టేందుకే హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన‌ట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగటం లేదని టీఆర్ఎస్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. హుజూర్ నగర్‌లో  సీపీఐ, సీపీఎం, టీడీపీతో కలిపి ఒకే అభ్యర్థిని నిలబెట్టాలని చూసినా… అది సాధ్యం కాలేదన్నారు. ఇక సీపీఐ నిర్ణ‌యం గురించి స్పందిస్తూ....సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వటం సరికాదని…ఇది చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుందన్నారు. కాగా, టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి అండ‌గా నిల‌వ‌డంతో...టీఆర్ఎస్‌కు తెలంగాణవాదుల పూర్తి మ‌ద్ద‌తు దొర‌క‌క‌పోవ‌చ్చున‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఇదిలాఉండ‌గా, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయకూడదని నిశ్చయించుకొన్న క్రమంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్.. ఆ పార్టీ మద్దతు కోరిన విషయం తెలిసిందే. ఇరుపార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కార్యవర్గ సమావేశంలో సీపీఐ నేతలు చర్చించారు. అనంతరం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. సమావేశంలోని వివరాలను మీడియాకు వివరిస్త్తూ.. అసెంబ్లీ ఎన్నికల వరకే కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కొనసాగిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేశామని గుర్తుచేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని సీపీఐ నిర్ణయించిందని.. ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఎన్నికల పొత్తులు ఎవరితో పెట్టుకొన్నా.. సీపీఐ ప్రజల వెంటనే ఉంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: