ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో మొదటిసారి మంత్రులైన వారు చాలామంది ఉన్నారు. అందులో  శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ కూడా తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ప్రోత్సాహంతో 2004లో కృష్ణదాస్ వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే వైఎస్ మరణం, తర్వాత జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.


ఈ క్రమంలో 2012 జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇక 2014లో అదే స్థానం నుంచి ఓటమి పాలవ్వగా, 2019 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించారు. మొదటి నుంచి పార్టీకి అండగా ఉండటంతో జగన్ కృష్ణదాసుకు రోడ్లు,భవనాల మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ నాలుగు నెలల కాలంలో రోడ్లు, భవనాల శాఖలో చెప్పుకోదగిన నిర్ణయాలు ఏమి తీసుకోలేదని చెప్పాలి. కాకపోతే తొలిసారి మంత్రి పదవి చేపట్టడంతో, శాఖని అవగాహన చేసుకోవడంలో ధర్మానకు కొంచెం సమయం పట్టింది.


నిదానంగా శాఖపై పట్టు పెంచుకుని..రోడ్లు భవనాలకు సంబంధించి చిన్న చిన్న నిర్ణయాలని తీసుకున్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లని బాగుచేయించే కార్యక్రమాలు చేశారు. అలాగే రాష్ట్రంలో 400 వందల వంతెనల నిర్మాణానికి టెండర్లను పిలిచారు.  అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.329కోట్లు మంజూరు చేశారు. రూ. 6500కోట్లతో ఎన్డీబీ ప్రాజెక్ట్‌ పనులు కొనసాగుతున్నాయి.


ఇలా చిన్న చిన్న నిర్ణయాలు తప్ప తన శాఖలో పెద్ద మార్పులు జరిగేవి ఏమి తీసుకోలేదు. దీంతో మంత్రిగా ధర్మాన పనితీరు పెద్దగా సంతృప్తిలేదనే చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో తీసుకునే నిర్ణయాలు బట్టి కృష్ణదాసుకు మరింత పట్టు దొరికే అవకాశముంది. మంత్రిగా ధర్మాన పనితీరు ఇలా ఉంటే...అధికార నేతగా ప్రతిపక్ష చేసే విమర్శలని తిప్పికొట్టడంలో కూడా ధర్మాన వెనుకపడ్డారని అనిపిస్తోంది. ఆయన కొంచెం మృదుస్వభావి కావడం వల్ల దూకుడుగా వెళ్లలేకపోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అయితే ధర్మానకు తిరుగులేదని చెప్పాలి. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. మొత్తం మీద చూసుకుంటే ధర్మాన మంత్రిగా బొటాబొటి మార్కులతో పాస్ అయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: