బొత్స సత్యనారాయణ వైసీపీలో సీనియర్ మంత్రి. ఆయన వైఎస్సార్ హయాంలో రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. అలాగే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా కూడా మంత్రిగా చేశారు. ఇక పీసీసీ ప్రెసిడెంట్ గా ఉమ్మడి ఏపీలో పనిచేసిన బొత్స వైసీపీలో చేరి మళ్ళీ మంత్రి కాగలిగారు. ఆయనకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి విధితమే. బొత్స తన సీనియారిటీతో ఇటు టీడీపీని ఒంటిచేత్తో అసెంబ్లీ లోపలా బయటా అడ్డుకుంటున్నారు.


ఇదిలా ఉండగా ఈ రోజు బొత్స  మాట్లాడుతూ వైసీపీ సర్కార్ గురించి చేసిన కొన్ని  కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఏపీలో ఆర్ధిక పరిస్థితి అద్వాన్నంగా  ఉందని బొత్స అన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని బొత్స అనడం విశేషం. ఇదంతా గత సర్కార్ టీడీపీ చేసిన నిర్వాకమేన‌ని బొత్స‌ అన్నారు.


టీడీపీ అన్ని విధాలుగా ఏపీని భ్రష్టుపట్టించిందని కూడా బొత్స అన్నారు. ఒక్కోటీ తమ ప్రభుత్వం మరమ్మతులు చేసుకుని వస్తోందని బొత్స చెప్పారు. ఏపీలో పాలన గాడిలో పెడుతున్నామని, అలాగే ఆర్ధిక పరిస్థితిని కూడా ఒక క్రమపధ్ధతిలో పెడుతున్నామని మంత్రి బొత్స చెప్పుకోచ్చారు. తాము చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోకుండా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడాన్ని ఆయన తప్పుపట్టారు.


ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్లను తాము రద్దు చేయలేదని, వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టామని అన్నారు. ఆసుపత్రులు ఉన్న చోట అన్న క్యాంటీన్లను పెట్టాలని తమ ప్రభుత్వం అనుకుంటోందని ఆయన చెప్పారు. దీని వల్ల అన్నార్తులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయంలో  విధివిధానాలు ఆదేశించామని, అవి రాగానే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మొత్తానికి ఏపీ ఆర్ధిక పరిస్థితి డేంజర్లో ఉందని బొత్స చెప్పడంతో ఆందోళన కలుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: