ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రైతులు పంటలు వేసే సమయంలోనే పంటల యొక్క మద్దతు ధరలు ప్రకటించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ధరలు తగ్గుముఖం పట్టినా రైతులను ఆదుకోవటం కొరకు ప్రతిపాదనలతో ప్రభుత్వం సిద్ధంగా ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. 
 
ప్రభుత్వం ధరల విషయంలో జోక్యం చేసుకున్న తరువాత పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అధికారులు దళారీ వ్యవస్థను నిర్మూలించటానికి పనిచేయాలని సీఎం సూచించారు. గ్రామసచివాలయాలలో పంటల వివరాలు, ధరలను ప్రకటించాలని చెప్పారు. రైతులకు నష్టం రాకుండా కనీస మద్దతు ధర లేని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని సీఎం స్పష్టం చేశారు. 
 
రాయలసీమ ప్రాంతంలో ఈ నెల పూర్తయ్యేలోపు చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ బోర్డులో సంబంధిత రంగాలకు చెందిన నిపుణులకు ప్రాముఖ్యత ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. చిరు ధాన్యాల బోర్డు విధివిధానాలపై సీఎం అధికారులతో చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కొరకు గోడౌన్లు మరియు కోల్డ్ స్టోరేజీలపై సమగ్ర పరీశీలన చేయాలని సీఎం అన్నారు. 
 
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను బలోపేతం చేయాలని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలను అధ్యయనం చేయటం కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని , బ్యాంకుల బలోపేతం కొరకు కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని సీఎం అన్నారు. అధికారులు రాష్ట్రంలోని 85 రైతు బజార్లలో 25 రూపాయల చొప్పున కిలో ఉల్లిని విక్రయిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: