తండ్రి వైఎస్సార్ పేరు చెప్పుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ తన తండ్రి ఇమేజ్ కి తోడు తన రెక్కల కష్టాన్ని, సొంత ఇమేజిని కూడా కలుపుకుని ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ ప్రధకానికి తండ్రి పేరు మాత్రమే వాడుతున్నారు. ఆ విధంగా వైఎస్సార్ జనంలో చిరస్మరణీయంగా నిలవాలని తాపత్రపయడుతున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ అయిదేళ్ళ పాలన ప్రజారంజ‌కం అని కూడా చెబుతూంటారు. అటువంటి జగన్ తండ్రి తెచ్చిన ఓ జీవోను రద్దు చేయాలనుకుంటున్నారా..


అవును అది నిజమే. ఎపుడో 16 ఏళ్ళ క్రితం తన తండ్రి తెచ్చిన జీవో ఫలితాలు ఇపుడు ముగిసినందువల్ల దాన్ని రద్దు చేయడం ద్వారా ఇప్పటికి తగినట్లుగా  న్యాయం చేయాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. కడప కర్నూల్ కెనాల్ నుంచి 10 టీఎంసీల నీటిని 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ అప్పటికి నీరు లేక దుర్బిక్షంగా ఉన్న అనంతపురానికి అందిస్తూ జీవో నంబర్ 3 ద్వారా ఆదేశాలు ఇచ్చారు.


అయితే ఇపుడు అనంతపురానికి  హంద్రీనీవా  మొదటి దశ పనుల ద్వారా క్రిష్ణా జలాలు పూర్తిగా వెళ్తున్నాయి. దాంతో కేసీ కెనాల్ నీరు మొత్తం 15 టీఎంసీల వాటా తమకే ఇవ్వాలని కడప, కర్నూల్ జిల్లాల రైతులు పట్టుపడుతున్నారు. అనంతపురం జిల్లా అవసరాలను హంద్రీనీవా తీరుస్తున్నందువల్ల ఇపుడు కేసీ కెనాల్ నీరు అవసరం లేదని జలవనరుల విభాగం అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ సైతం దీని మీదనే ఆలోచిస్తున్నారని అంటున్నారు.


మొత్తానికి మొత్తం 15 టీఎంసీల నీరు కడప, కర్నూల్ రైతులకు ఇవ్వడం ద్వారా న్యాయం చేయాలని జగన్ భావిస్తున్నారట. అంటే తన తండ్రి కరవు తో అల్లాడుతున్న అనంతకు అప్పట్లో చేసిన సాయం అవసరం ఇపుడు లేనందువల్లనే  జీవో నంబర్ 3 ని  రద్దు చేయాలనుకుంటున్నారు. మొత్తానికి తండ్రీ కొడుకుకు రాయలసీమ రైతాంగం కష్టాలు ఇబ్బందులు ద్రుష్టిలో పెట్టుకునే కాలానికి తగినట్లుగా చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

ysr