గత లోక్ సభ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన మాజీ ఎంపీ కవిత...మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారా? టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించనున్నారా? అంటే పార్టీ వర్గాల్లో టాక్ చూస్తుంటే... అవుననే అనిపిస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కేసీఆర్ తనయ కవిత అనూహ్య రీతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఘోర పరాజయం చెందింది. ఈ ఓటమితో కవిత మళ్ళీ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.


కేవలం కుటుంబానికి పరిమితమై సొంత పనులని చూసుకున్నారు. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న కవిత మరోసారి రాజకీయ తెరమీద కనిపించేందుకు సిద్ధమయ్యారు. దానికంటే ముందు కొంతకాలంగా యాక్టివ్ లో లేని జాగృతిని యాక్టివ్ చేశారు. రెండేళ్లుగా  జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమానికీ హాజరుకాని కవిత ఈసారి జాగృతికి అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ జాగృతి కార్యకర్తలు బతుకమ్మ సంబరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.


అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని కవిత చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మాట్లాడటం చూస్తుంటే త్వరలోనే, టీఆర్ఎస్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ని మంత్రివర్గంలో తీసుకున్నారు. పైగా మున్సిపల్ శాఖ కాబట్టి ఎక్కువ కృషి చేయాల్సిన అవసరముంది.


అలాగే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కేటీఆర్ వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వొచ్చు. అది కాకపోయిన పార్టీలో మంచి పదవి ఇవ్వాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కవితకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమో లేక రాజ్యసభ ఇచ్చి మళ్ళీ ఢిల్లీలో యాక్టివ్ చేయాలని కోరుతున్నారు. అయితే కవితకు మాత్రం పార్టీలో ఏదొక పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి పార్టీలో కవిత ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: