రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు కానీ, శాశ్వ‌త శ‌త్రువులు కానీ ఉండ‌ర‌ని అంటారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మోడీ హ‌ఠావో.. బీజేపీ హ‌ఠావో.. అంటూ దేశం న‌లుమూల‌లూ తిరిగి ప్ర‌చారం చేసిన ఆయ‌నే ఇప్పుడు బీజేపీతో మైత్రి కోసం త‌హ‌త‌హ‌లాడి పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అంతేకాదు, రాజ‌కీయాల్లో ఓన‌మాలు కూడా నేర్చుకోలేదంటూ.. దుయ్య‌బ‌ట్టిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌తోనూ చెలిమి కోసం.. చేతులు చాస్తున్నారట‌! చిత్రంగా అనిపించినా.. రాజ‌కీయాల్లో ఇది కామ‌నేన‌ని అంటున్నారు.


2014 ఎన్నిక‌ల‌లో ఈ మూడు పార్టీలూ క‌లిసే పోరుకు దిగాయి. అయితే, జ‌న‌సేన మాత్రం పోటీకి దూరంగా ఉన్న‌ప్ప‌టికీ. బీజేపీ-టీడీపీల‌కు ప్ర‌త్య‌క్షంగానే ప‌వ‌న్ మ‌ద్ద‌తిచ్చారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్పా టు చేసుకోగా.. బీజేపీ కూడా ఆశించిన మేరకు టికెట్లు తెచ్చుకుని అసెంబ్లీ, పార్ల‌మెంటుల్లో క‌మ‌ల వికాసం చేసుకుంది. అయితే, త‌ర్వాత ఈ మూడు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వైరం పెర‌గ‌డంతో ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారుగా ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డారు. సీట్ల‌ను బ‌ట్టి త‌ర్వాత క‌లుస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. క‌ట్ చేస్తే.. బీజేపీ.. జ‌న‌సేన‌లు అంచ‌నాల‌కు కూడా అంద‌కుండా ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి.


ఇక‌, టీడీపీ కేవ‌లం 23 సీట్ల‌తో కొంత మేర‌కు గౌర‌వం కాపాడుకుంది. ఇదిలావుంటే, ప్ర‌స్తుతం అత్య‌ధిక మెజారిటీతో విజ‌యం సాధించి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్న జ‌గ‌న్ ను ఎదుర్కొనేందుకుచంద్ర‌బాబు వ్యూహాలు ఫ‌లించ‌డం లేదు., జ‌గ‌న్ త‌న‌దైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోందని, గ్రామాల్లోకి రానివ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన లు చేసింది. రద్దుల పద్దులు, కూల్చివేతలు, నిలిపివేతల ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తున్నారు చం ద్రబాబు. గ్రామసేవకుల ఉద్యోగాలు, తాజాగా సచివాలయ ఉద్యోగాలపైనా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు సీఎం జగన్.


తన పనితాను చేసుకుపోతూ, బాబు మాటలకు అసలు ప్రాధాన్యమివ్వడం లేదు. జగన్‌ నుంచి రియాక్షన్‌ ఏమీ లేకపోవడంతో, చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నారట. బీజేపీ, జనసేనలతో కలిసి ఆందోళనలు చేయాలని, జగన్‌ సర్కారు తప్పిదాలను జనంలోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట చంద్రబాబు. అంద‌రిదీ ఇప్పుడు ప్ర‌తిప‌క్ష స్కూలే కాబ‌ట్టి.. ఒక‌రినొక‌రు చేతులు క‌లుపుకొని ముందుకు సాగాల‌నేది ఆయ‌న వ్యూహం. అయితే, బీజేపీ మాత్రం ఒంట‌రిగానే ఎద‌గాల‌ని ఎలాగూ.. టీడీపీ ప‌ని అయిపోయింది కాబ‌ట్టి ఆ ప్లేస్‌ను తాను భ‌ర్తీ చేయాల‌ని భావిస్తోంది. ఇక‌, ప‌వ‌న్ మాత్రం త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌కు చెప్పడం లేదు. ఈ నేప‌థ్యంలో బాబు ఆశ‌లు ఏ మేరకు ఫ‌లిస్తాయో .. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: