టీడీపీ అధినేత చంద్రబాబు రోజూ భోజనం చేస్తారో లేదో తెలియదు గానీ...వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై విమర్శలు చేయడం మాత్రం చేయకుండా ఉండలేరు. ప్రతిరోజూ మీడియా వేదికగా లేదా సోషల్ మీడియా వేదికగా వైసీపీపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఉంటున్నారు. అయితే ఆయన విమర్శల్లో అర్ధం పర్ధం లేనివే ఎక్కువ ఉంటున్నాయి. తాజాగా అక్టోబర్ 2 అన్ని వైన్ షాపులు మూసి ఉంటే...మహాత్మా గాంధీ జయంతి రోజు కూడా వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేస్తున్నారని పనికిమాలిన విమర్శ చేశారు.


ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఒక వివాదం హల్చల్ చేస్తోంది. నెల్లూరు జిల్లా కల్లూరిపల్లిలోని తన ఇంటికి శుక్రవారం రాత్రి మద్యం సేవించి అనుచరులతో కలిసి కోటంరెడ్డి వచ్చి దౌర్జన్యానికి దిగారని వెంకటాచలం ఎం‌పి‌డి‌ఓ సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తమ ఇంటికి నీటి సరఫరా, కరెంట్ సరఫరా కట్ చేశారని ఆరోపిస్తూ..తమ కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు.


ఎంపీడీవో ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి, అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. ఎం‌పి‌డి‌ఓ ఆరోపణలపై కోటంరెడ్డి స్పందిస్తూ.. వెంచర్‌కు అనుమతి ఇవ్వలేదని తన ఇంటిపై దౌర్జన్యం చేశారని ఆమె చేస్తున్న ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు. ఇక ఈ వివాదంలో ఎమ్మెల్యేది ఏమన్నా తప్పు ఉంటే కేసు నమోదై ఉంది కాబట్టి విచారణలో తేలుతుంది. కానీ దీనిపై టీడీపీ నేతలు, చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఓ ఊదరగొట్టేస్తున్నారు.


అయితే వైసీపీ ఎమ్మెల్యే బెదిరించారనే ఆరోపణలపై తెగ ఫైర్ అవుతున్న చంద్రబాబు...వారి ప్రభుత్వ హయాంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహశీల్దార్ వనజాక్షిని నడిరోడ్డుపైనే జుట్టుపట్టుకుని కొట్టినప్పుడు ఏమైపోయారో తెలియడం లేదు. అప్పుడు కనీసం నోరు తెరిచి కూడా మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు తెగ గొంతు చించేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో చంద్రబాబు వైఖరి సరైనది కాదు. అప్పుడు చింతమనేని గొడవని ఖండించి ఉంటే...ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడానికి అర్హత ఉండేది. 



మరింత సమాచారం తెలుసుకోండి: