ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలనే దిశగా ఏపీపీఎస్సీ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనరల్ సర్వీసెస్, టీచింగ్, ఇంజినీరింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్ ఇలా అన్ని ఉద్యోగాలను గ్రూపులుగా విభజించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. 
 
ఏపీపీఎస్సీ ఒక్కో గ్రూపుకు ఒక్కో పరీక్షను మాత్రమే నిర్వహిస్తుంది. ఈ నెలాఖరులోపు ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే విభిన్న ఉద్యోగాలకు వేరువేరుగా పరీక్షలు రాస్తున్న యువత కష్టాలు తీరుతాయి. సాధారణంగా నిరుద్యోగులు డిగ్రీ అర్హతతో ఉన్న వివిధ ఉద్యోగాలకు వేరు వేరు పరీక్షలు రాస్తున్నారు. వేరు వేరు పరీక్షలు రాయటం వలన విలువైన సమయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. 
 
ఫలితాలు విడుదలైన తరువాత నియామక ప్రక్రియ పూర్తి చేయటానికి కూడా అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది. కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికై ఇష్టమైన పోస్టులోనే ఉండిపోతూ మిగిలిన పోస్టులు వదిలేస్తూ ఉండటంతో ఆ పోస్టులు ఖాళీగానే ఉండిపోతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలలో కేటగిరి 1 లో 4 పోస్టులను ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేశారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయం ద్వారా ఇదేవిధంగా ఒకే పరీక్షతో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. 
 
ఈ విధంగా చేయటం వలన ప్రభుత్వానికి పని భారం మరియు ఆర్థిక భారం తగ్గుతుంది. 2020 జనవరి నెలలో ప్రభుత్వం రాష్ట్రంలోని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఏపీపీఎస్సీ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లిన తరువాత ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. న్యాయ, ఆర్థిక మొదలైన ప్రత్యేక పోస్టులకు మాత్రం అర్హతల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: