వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. పార్టీలో కేడ‌ర్‌ ఉండి.. ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీ లేకుండా ఉన్న వారికి వెంటనే పార్టీలో చేరేందుకు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తోంది. ఇక ఇప్పటికే టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన‌ పలువురు కీలక నేతలను వైసీపీలో చేర్చుకున్న జగన్ ఆ పార్టీలో ఉన్న మరికొంత మంది కీలక నేతలను సైతం పార్టీలో చేర్చుకునేందుకు ఓకే చెబుతున్నారు.


కీలకమైన ఉత్తరాంధ్ర నుంచి అడారి ఆనంద్ కుమార్, పిల్లా రమాదేవి వైసీపీలో చేరిపోయారు. గోదావరి జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇప్పటికే వైసీపీ కండువా క‌ప్పుకోగా.... మరో నేత వరుపుల రాజా సైతం అదే దారిలో ఉన్నారు. ఇక కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో కీలక నేతగా ఉన్న వ్యక్తికి జగన్ నుంచి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.


ఆ నేత ఎవ‌రో కాదు మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సోద‌రుడు, న‌ర్సీప‌ట్నం మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు. ఆయ‌న‌ను వైసీపీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. సన్యాసిపాత్రుడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు.


తొలుత ఆదివారం అమరావతి వెళ్లి పార్టీలో చేరాల్సి ఉండగా, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వాయిదా పడిందన్నారు. త్వరలో ఆయనను పార్టీలో చేర్చుకుంటామని ఆయన వెల్లడించారు. ఏదేమైనా స‌న్యాసిపాత్రుడు వైసీపీ ఎంట్రీపై కొద్ది రోజులుగా నెల‌కొన్న స‌స్పెన్స్‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఇక న‌ర్సీప‌ట్నం రాజ‌కీయాల్లో వార్ వ‌న్‌సైడ్ అవ్వ‌డం షురూయే..!



మరింత సమాచారం తెలుసుకోండి: